
మళ్లీ టీచర్ల సర్దుబాటు
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ మరోసారి చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అవసరానికి మించి పనిచేస్తున్న టీచర్లను గుర్తించింది. అయితే ఇప్పటికే మొదటి విడత సర్దుబాటు ప్రక్రియలో 131 మందిని అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించారు. ఇటీవల 76 మందికి పదోన్నతులు లభించా యి. దీంతో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టుల ఖాళీ లు ఏర్పడ్డాయి.
ఈనెల 4న ప్రభుత్వం మరోసారి సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తొలివిడతలో గందరగోళం నేపథ్యంలో ఈ సారి ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రత్యేక కమిటీలతో పాటు ఇద్దరు మండల విద్యాధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఇప్పటికే ప్రక్రియ తుది దశకు రాగా, నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 739 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సర్దుబాటు ద్వారా తాత్కాలికంగా భర్తీ చేసేందుకు విద్యా శాఖ జూలైలో మొదటి విడతలో 131 మందిని సర్దుబాటు చేశారు. మొదట 141 మందిని సర్దుబాటు చేయగా, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, పది మందిని అదే పాఠశాలలో కొనసాగించారు. అయితే ఆయా ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య లేకున్నా ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయించుకున్నారు.
ప్రస్తుతం అదే పాఠశాలలో కొనసాగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 101 మందికి ప్రమోషన్ లభించగా, 76 మంది మాత్రమే విధుల్లో చేరారు. 25 మంది చేరలేదు. దీంతో పాఠశాలల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. తాజాగా 35 మంది ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద అవసరం ఉన్న పాఠశాలలకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలోని కాంప్లెక్స్, మండల పరిధిలో, పక్క మండలాలకు సర్దుబాటు చేయనున్నారు. ఇటీవల పదోన్నతి పొందిన వారిలో జిల్లాలో 15 మంది పీజీహెచ్‌ఎంలు, 61 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు.
ప్రాథమిక విద్యపై ప్రభావం..
జిల్లాలో 250 ఎస్జీటీ, 104 స్కూల్ అసిస్టెంట్, 16 పీజీహెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండగా, మిగతావి వృత్తి విద్యా, ఇతర టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని ఉన్నత పాఠశాలలు, అవసరం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ప్రాథమిక విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. ఇప్పటికే 50 శాతం మంది విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనకబడ్డారు. ఉపాధ్యాయుల సర్దుబాటు కాకుండా విద్యా వలంటీర్లను నియమించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు..
ప్రాథమిక 500
ప్రాథమికోన్నత 119
ఉన్నత 120
విద్యార్థులు 65,000
ఉపాధ్యాయులు 2,667
తొలివిడతలో సర్దుబాటైన టీచర్లు 131
పకడ్బందీగా ప్రక్రియ..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం. దాదాపు 35 మంది టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇద్దరు ఎంఈవో ల పర్యవేక్షణలో ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మొదటి విడతలో 131 మందిని ఆయా పాఠశాలలకు కేటాయించాం. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో జిల్లాలో 76 మందికి ప్రమోషన్లు లభించాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.
– వేణుగోపాల్‌గౌడ్, విద్యాశాఖ ఏడీ