
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం
ఆదిలాబాద్‌టౌన్/సాత్నాల: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఆయా వినాయక మండపాల నుంచి ప్రత్యేక రథాల్లో శనివారం ప్రారంభమైన గణనాథుల శోభా యాత్ర ఆదివారం వరకు కొనసాగింది. అర్ధరాత్రి తర్వాత నుంచి క్రమంగా భోరజ్ మండలంలోని పెన్‌గంగకు చేరువయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా వినాయకులను నిమజ్జనం చేశారు. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించడంతో ప్రక్రియ సజావుగా ముగిసినట్లు తెలిపారు. 412 విగ్రహాల నిమజ్జనం అయినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఆయన వెంట ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
గట్టి బందోబస్తు..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్పీ వరకు తనిఖీలు చేపట్టారు. శాంతియుతంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు విధులను కేటాయించారు. అలాగే పెన్‌గంగ వద్ద ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి దగ్గరుండి ప్రక్రియను పర్యవేక్షించారు. వీరితో పాటు రెవెన్యూ, వైద్య, ఫైర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు విధులు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన శోభయాత్రలను ఎస్పీ అఖిల్ మహాజన్ దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 11 రోజుల పాటు పోలీసులు విధులు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు సాగేలా కృషి చేశారని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది సివిల్, రిజర్వు, హోంగార్డు సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బందిని అభినందించారు. 150 మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని సేవలు అందించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌తో పాటు బోథ్, ఉట్నూర్, ఇచ్చోడలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా వేడుకలు పూర్తయినట్లు చెప్పారు.

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం