
పక్కాగా సాగు లెక్క
డిజిటల్ క్రాప్ బుకింగ్ షురూ క్షేత్రస్థాయిలో నమోదు చేపట్టిన వ్యవసాయ శాఖ నెలాఖరులోపు పూర్తి చేసేలా కార్యాచరణ
ఇచ్చోడ: జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల సా గు లెక్క పక్కాగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రాప్ బుకింగ్ కోసం వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏఈవోలకు మొబైల్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసింది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించి సర్వే నంబర్, రైతుల వారీగా ఫొటోలను చిత్రీకరించి పంటల వివరాలు నమోదు చేయాలి. ఈ నెలాఖరు వ రకు సర్వే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏఈ వోలు డిజిటల్ క్రాప్ బుకింగ్ కోసం పొలం బాట పడుతున్నారు. క్లస్టర్ పరిధిలో ఒక్కో ఏఈవో 5 వేల ఎకరాల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
మూడు వేలు డిజిటల్.. రెండు వేలు ఆన్‌ఫోన్
ప్రతీ ఏఈవో క్లస్టర్ వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్ ద్వారా మూడు వేల ఎకరాల్లో వివరాలు నమోదు చేయాలి. మరో రెండు వేల ఎకరాల వివరాలను రైతుల ద్వారా అడిగి ఆన్‌ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మారుమూల గ్రామాల్లో సాంకేతికత సమస్యల దృష్ట్యా ఆన్‌ఫోన్ నమోదుకు ప్రభుత్వం వెసులుబాట కల్పించింది.
పంటల నమోదు షురూ
ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్లు, రైతుల వారీగా సాగు చేస్తున్న పంటల ఫొటోలు తీసి యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తున్నారు. రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నాడో వంటి వివరాలను అందులో పొందుపరుస్తున్నారు.
పంట విక్రయాల్లో పారదర్శకత...
డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల విక్రయ సమయంలో పారదర్శకత ఏర్పడనుంది. పత్తి, సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రైతుకు మద్దతు ధర అందుతుంది.అయితే ప్రైవేట్‌తో పోల్చితే ఈ ధరలో వ్యత్యాసం ఉండడంతో కొనుగోళ్లలో గోల్‌మాల్‌కు అవకాశం ఉంటుంది. దళారులు పంట దిగుబడులను రైతుల నుంచి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఆ పంటలను కొంతమంది సాగు చేయని రైతుల పేరిట విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంట ఏ మేరకు సాగవుతుందో రైతుల వారీగా పూర్తి వివరాలుంటాయి. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. విక్రయాల్లో పారదర్శకత ఏర్పడనుంది.
గడువులోపు పూర్తి చేస్తాం
జిల్లాలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఏఈవోల మొబైల్ ఫోన్లలో ఇప్పటికే యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాం. వారు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో..
మండలాలు : 20
మొత్తం రైతులు : 1.65లక్షలు
క్లస్టర్లు : 101
సాగుభూమి(ఎకరాల్లో) : 5లక్షల 77వేలు