
పల్లెలకు పాలనాధికారులు
ఇప్పటికే పోస్టింగ్ ఉత్తర్వులు త్వరలోనే జీపీవోలుగా బాధ్యతలు గ్రామాల్లో మెరుగుపడనున్న రెవెన్యూ సేవలు భూ సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం
కై లాస్‌నగర్: పల్లెలకు పాలనాధికారులు రాబోతున్నారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా రెవెన్యూశాఖ వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల (జీపీవో) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఈమేరకు వారు నిర్వహించాల్సిన విధులకు సంబంధించిన జాబ్‌చార్టును సైతం స్పష్టం చేసింది. ఈ నెల 5న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించి 83 మంది జీపీవోలు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. వీరికి కలెక్టర్ కౌ న్సెలింగ్ నిర్వహించి త్వరలోనే క్లస్టర్ల వారీగా కేటాయించనున్నారు. వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో రెవెన్యూశాఖకు దూరమైన అధికారులు తి రిగి గ్రామాల్లో అందుబాటులోకి రానున్నారు. దీంతో భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
క్లస్టర్‌కు ఒక జీపీవో..
జిల్లాలో మొత్తం 508 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో 2, 3 గ్రామాలను కలిపి గతంలోనే 183 రెవెన్యూ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తొలుత గ్రామానికో జీపీవో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లను స్వీకరించింది. అయితే చాలా మంది ఆసక్తి చూపలేదు. ఆప్షన్లు ఇచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా అందులోనూ చాలా మంది ఫెయిలయ్యారు. దీంతో సరిపడా అందుబాటులో లేకపోవడంతో క్లస్టర్‌కు ఒక జీపీవోను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 83 మందికి ఇటీవల సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. సర్దుబాటులో భాగంగా నిర్మల్ జిల్లాలో 10 మంది అదనంగా ఉండగా వారిని ఆదిలాబాద్‌కు కేటాయించారు. వారిని పరిగణలోకి తీసుకుంటే మొత్తం 93 మంది అందుబాటులోకి రానున్నారు. వీరికి సొంత నియోజకవర్గం, పనిచేస్తున్న మండలంలో కాకుండా ఇతర మండలాల్లోని క్లస్టర్లలో పోస్టింగ్ కేటాయించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిని మినహాయిస్తే జిల్లాలో మరో 90 క్లస్టర్లు ఖాళీగా ఉండనున్నాయి.
వారికి ఇన్‌చార్జి బాధ్యతలు
మిగతా 93 క్లస్టర్లకు సంబంధించి గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు అర్హులైన వారి వివరాలను మండలాల వారీగా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
భూభారతి అమల్లో కీలకపాత్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం కింద అందిన దరఖాస్తుల పరిష్కారంలో జీపీవోలు కీలకపాత్ర పోషించనున్నారు. గతంలో రెవెన్యూశాఖలో పనిచేసిన అనుభవం ఉండటంతో దరఖాస్తుల విచారణలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. గ్రామాల్లో తలెత్తె భూ వివాదాలను స్థానికంగానే పరిష్కరించడంలో వీరి పాత్ర కీలకం కానుంది.