
భార్య జ్ఞాపకార్థం.. బడి కోసం..!
భైంసాటౌన్: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అయితే కొద్దికాలానికి భార్య మృతి చెందడంతో, ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ బడుల బాగే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయనే భైంసాకు చెందిన హెచ్‌ఎం రాచేవాడ్ గంగాప్రసాద్. ఈయన భార్య పద్మావతి ఎస్‌ఏ(ఇంగ్లిష్)గా పనిచేస్తూ 2015లో మృతిచెందారు. దీంతో ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం సొంతంగా ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గంగాప్రసాద్ తొలుత తానూర్‌లో ఎస్‌జీటీగా, అక్కడి నుంచి ముధోల్‌లో ఎస్‌ఏగా, ఆపై మాటేగాం, చుచుంద్‌లో పనిచేశారు. ముధోల్‌లో పనిచేసిన సమయంలో అక్కడ 9 ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా, చుచుంద్, మిర్జాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలను సైతం అప్‌గ్రేడ్ చేయించారు. ప్రస్తుతం భైంసాలోని జెడ్పీ బాలికల పాఠశాల హెచ్‌ఎంగా చేస్తుండగా, తెలుగు మీడియం పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరడంతోపాటు విద్యార్థులకు వసతులు లేవు. సొంత ఖర్చుతో భవనానికి మరమ్మతు, ప్రార్థన కోసం స్టేజీ, కోతుల బెడద నివారణకు ఇనుప జాలి, విద్యార్థినులు, ఉపాధ్యాయుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, 16 కంప్యూటర్లు, ఫ్యాన్లు, విద్యుత్ మరమ్మతులు చేయించారు. ఇందుకుగాను రూ.6.5లక్షలు వెచ్చించారు.
ప్రభుత్వ బడిని కాపాడాలి
పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. నా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ బడుల బాగు కోసం నా వంతు కృషి చేస్తున్నాను.
– ఆర్.గంగాప్రసాద్,
హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, భైంసా