
ఇద్దరిని కాపాడి..వాగులో గల్లంతైన ఒకరు
నార్నూర్: ఇటీవల కురుస్తున్న వర్షాలు జనజీవనం అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో మండలంలోని మల్లెంగి వాగు పొంగింది. అదే గ్రామానికి చెందిన మొత్తం 9 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వాగు అవతల ఒడ్డుకు ఉదయం చేరుకున్నారు. దినమంత పనిచేసి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. గ్రామ సమీపంలోని వాగులో నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో జాడే శంకర్ (42)తోపాటు, మరో ఇద్దరు రైతులు జాదవ్ మిట్టు, జాదవ్ మిథున్‌లతో కలిసి వాగు దాటే సాహసం చేశారు. అప్పటికే వాగులో భారీగా వరద నీరు ఒకే సారి రావడంతో ఉధృతి పెరిగింది. పరిస్థితిని గమనించిన శంకర్ ఇద్దరు రైతులను ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు. ఆయన బయటి వచ్చే క్రమంలో వరద ఉధృతికి గల్లంతయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో మృతదేహం కిలోమీటరు దూరంలో వాగులో లభించిందని ఎస్సై అఖిల్ తెలిపారు. మృతుడికి భార్య జాడే సరిత, ఇద్దరు కూమారులు ఉన్నారు.

ఇద్దరిని కాపాడి..వాగులో గల్లంతైన ఒకరు