
● విద్యుత్ శాఖలో అంతా ఇష్టారాజ్యం ● సబ్ డివిజన్ వర్క
సాక్షి,ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో సబ్ డివిజన్‌స్థాయి టెండర్లలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి అధికారులే ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. తమ పరిధి కాకపోయినప్పటికీ, తమకు ఆ టెండర్లు ఇచ్చే అధికారం లేకపోయినా కొంత మంది అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. ఉట్నూర్ పరిధిలోని సబ్‌డివిజన్ వర్క్స్ కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలే అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలోనూ ఈ డివిజన్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం, దానిపై సీఎండీ, జేఎండీ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా అక్కడ మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బినామీలకు పెద్దపీట..
విద్యుత్ శాఖలో టెండర్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికారులే తమ బంధువులను బినామీలుగా రంగంలోకి దించి దొడ్డిదారిన పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు ముందునుంచి ఉన్నాయి. పైస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు కొందరు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
రేట్లు సరిపోవడం లేదనే సాకు..
విద్యుత్ శాఖ జిల్లా పరిధిలో ఐదు సబ్ డివిజన్లు ఆదిలాబాద్, జైనథ్, ఆదిలాబాద్‌రూరల్, ఇచ్చోడ, ఉట్నూర్ ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ల పరిధిలో 30 మంది గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు ఉన్నారు. గతంలో టెండర్లు జరిగినప్పుడు రూ.20లక్షల విలువైన పనులను ఒక్కొక్కరికి అప్పగించారు. ఇది ఎస్‌ఈ స్థాయిలోనే కేటాయించారు. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్లీ వారికి వివిధ పనులకు సంబంధించి ఎక్స్‌టెన్షన్ ఇస్తారు. అదికూడా ఎస్‌ఈ స్థాయిలోనే జరగాలి. ఆ పరిమితి పూర్తి చేసుకున్న వాటికి సంబంధించి మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహిస్తారు. ఇలా సబ్ డివిజన్ల పరిధిలో కాంట్రాక్టర్ల గుర్తింపునకు సంబంధించి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. ఆ టెండర్లలో పాత కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చు. కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ పాత కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టర్లకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడ అవలంభించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వర్క్స్‌కు సంబంధించి రేట్లు తమకు సరిపోవడం లేదని, తాము ఆ పనులను చేపట్టమంటూ టెండర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదంతా విద్యుత్ శాఖ అధికారులకు, పాత కాంట్రాక్టర్లకు అంతర్గతంగా లోపాయికారి ఒప్పందంతోనే జరుగుతుందనే ప్రచారం ఉంది.
ఆ ముసుగులో పనులు అప్పగింత..
ఇలా పాత కాంట్రాక్టర్లు తమకు రేట్లు సరిపోవడం లేదని టెండర్లకు దూరంగా ఉండటం, దానికి సంబంధించి పైస్థాయిలో అధికారులకు నివేదికలు పంపడంతో ప్రస్తుతం సబ్ డివిజన్ స్థాయి కొత్త టెండర్లు కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. తద్వారా ఆయా వర్క్స్‌పై దీని ప్రభావం పడింది. కాంట్రాక్టర్లు రేట్లు సరిపోవడం లేదని పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో పాత కాంట్రాక్టర్లకు పాత అగ్రిమెంట్ల పైనే మళ్లీ కొత్త పనులను ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం
నా దృష్టికి రాలేదు..
సబ్ డివిజన్ స్థాయి వర్క్స్ టెండర్లు ఎస్‌ఈ స్థాయిలోనే జరుగుతాయి. ఉట్నూర్ డివిజన్‌లో ఆ పనులు డీఈ ఇచ్చినట్లు నా దృష్టికి రాలేదు. జిల్లాలో సబ్ డివిజన్ల పరిధిలో కొత్త టెండర్లకు సంబంధించి మూడుసార్లు కాల్‌ఫర్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రధానంగా వారు రేట్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. దీంతో పనులు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం ఆ పనులను చేపట్టాలని చెప్పడంతో కొంత మంది కాంట్రాక్టర్లకు ఎక్స్‌టెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
– జేఆర్ చౌహాన్, ఎస్‌ఈ, ఆదిలాబాద్

● విద్యుత్ శాఖలో అంతా ఇష్టారాజ్యం ● సబ్ డివిజన్ వర్క

● విద్యుత్ శాఖలో అంతా ఇష్టారాజ్యం ● సబ్ డివిజన్ వర్క