
● ఎన్‌ఆర్సీకి బడ్జెట్ సమస్య ● సరుకులు లేక సిబ్బంది అవస
ఆదిలాబాద్‌టౌన్: వివిధ రుగ్మతలతో బరువు పెరగని పిల్లలను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో గల న్యూట్రీషియన్ రీహాబిటేషన్ సెంటర్ (ఎన్‌ఆర్‌సీ)లో చేర్పిస్తారు. వీరికి వివిధ రకాల పోషకాహారంతో పాటు వైద్య చికిత్స అందజేస్తారు. ఆయా గ్రామాల నుంచి అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు పిల్లలను ఇక్కడ చేర్పించి వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఎత్తుకు తగ్గ బరువు ఉండని ఐదేళ్లలోపు పిల్లల్ని గుర్తిస్తారు. ఎన్‌ఆర్సీలో 14 రోజుల పాటు పౌష్టికాహారం అందజేస్తారు. అయితే రెండు నెలలుగా ఆ సెంటర్‌లో పిల్లలకు పోషకాహారం అందడం లేదు. బడ్జెట్ లేకపోవడంతో సిబ్బంది పిల్లలకు రిమ్స్‌లో రోగులకు అందించే భోజనం పెడుతున్నారు. పప్పు, అన్నం, పాలు తప్పా మరే పౌష్టికాహారం అందడం లేదని ఎన్‌ఆర్సీలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద కూడా ఈ భోజనం తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.
బడ్జెట్ లేక తంటాలు..
ఈ సెంటర్‌లో ప్రస్తుతం 13 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఆయాలు, ఒక కుక్, ఒక న్యూట్రీషనిస్ట్ పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిన కొనసాగుతున్నారు. బడ్జెట్ లేక వీరికి నెల వేతనం సైతం అందలేదని చెబుతున్నారు. నెలకు చిన్నారులకు భోజనం పెట్టేందుకు రూ.15వేలు ఖర్చవుతుందని, అయితే నెలరోజులుగా బడ్జెట్ లేకపోవడంతో తమ డబ్బులతోనే సరుకులు తెచ్చి పిల్లలకు పెడుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు.
ఎన్‌ఆర్సీలో చిన్నారులతో తల్లిదండ్రులు
అమలుకు నోచుకోని మెనూ
ఎన్‌ఆర్సీలో నెల వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలను చేర్పి స్తారు. పాలు, గుడ్లు, ఉప్మా, నెయ్యి, పోహా, సేమియా, ముర్కులు, దొడ్డు రవ్వ, హల్వా, కిచిడి, అన్నిరకాల కూరగాయలతో తయారు చేసిన భోజనం అందించాల్సి ఉంటుంది. అలాగే ఆలు రైస్, దాల్‌రైస్, సాబుదాన, రాగిజావ, టమాట రైస్, బెల్లం రైస్, వెజిటేబుల్‌రైస్ ఇలా అనేక రకాల పోషకాలు కూడిన భోజనాన్ని పెట్టాల్సింది. అయితే రెండు నెలలుగా సరిపడా సరుకులు లేకపోవడంతో ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కనీసం అక్కడ బియ్యం కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు గంటలకోసారి పిల్లలకు వివిధ రకాల ఆహార పదార్థాలు అందించాల్సి ఉంటుంది. అయితే సరుకులు నిండుకుండడంతో రిమ్స్‌లో రోగులకు పెట్టే పప్పు, అన్నంనే చిన్నారులకు అందించాల్సి వస్తోంది. దీంతో వారిలో బరువు కూడా పెరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ రాలేదు..
ఎన్‌ఆర్సీకి సంబంధించి బడ్జెట్ రాలేదు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న మాట వాస్తవమే. బియ్యంతో పాటు ఇతర స రుకులు లేవు. రిమ్స్‌లో రోగులకు అందిస్తున్న భోజనంలో నుంచి పిల్లలకు పెడుతున్నాం. మా సొంత ఖర్చుతో సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపడతాం.
– శ్రీనివాస్‌చారి, ఎన్‌ఆర్సీ మెడికల్ ఆఫీసర్

● ఎన్‌ఆర్సీకి బడ్జెట్ సమస్య ● సరుకులు లేక సిబ్బంది అవస