
‘స్పోర్ట్స్’లో కీచకపర్వం
● అమ్మాయిలపై లైంగిక వేధింపులు ● గతంలో ఓ శిక్షకునిపై వేటు ● తాజాగా మరో కోచ్‌పై పోక్సో కేసు ● క్రీడా పాఠశాలపై కరువైన పర్యవేక్షణ
ఆదిలాబాద్: ఓ వైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా శిక్షణలో తర్ఫీదు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పారు. ఒకటి హకీంపే ట, రెండోది కరీంనగర్‌లో ఉండగా, మరొకటి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016లో ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. అధికా రుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తరచూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్న ఈ క్రీడా పాఠశాలలో తాజాగా ఓ విద్యార్థినిపై శిక్షకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కేసు నమోదు కావడం గమనార్హం. క్రీడా శిక్షణ అందించాల్సిన శిక్షకులపై ఇలాంటి ఆరోపణలు రావడం, కేసులు నమోదు అవుతుండడం మిగతా విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆది నుంచీ అదే తీరు..
● 2023 సంవత్సరంలో ఈ పాఠశాలలో అథ్లెటిక్స్‌లో శిక్షణ అందించే శిక్షకుడు ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తొలుత విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు తర్వాత బయటకు పొక్కడంతో శిక్షకుడిపై వేటు వేశారు.
● గతంలో ఈ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఓ విద్యార్థి వేధింపులకు దిగాడని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని బయటకు రాకుండా అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని నాడు అధికారులు, సిబ్బంది చెప్పుకొచ్చారు.
● తాజాగా బాక్సింగ్ నేర్పించే శిక్షకునిపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఓ బాలిక తల్లిదండ్రులు జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సదరు శిక్షకునిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
క్రీడాకారులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు..
క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తే తమ పిల్లలు చదువుతోపాటు మంచి క్రీడాకారులుగా ఎదుగుతారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్‌లో 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన చేస్తూ జూడో, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు. అయితే కొంతమంది శిక్షకుల అనుచిత ప్రవర్తన కారణంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో అటు చదువుపై, ఇటు క్రీడలపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే పలువురు విద్యార్థులు టీసీలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కరువైన పర్యవేక్షణ..
ఇంత జరుగుతున్నా పట్టించుకోని సంబంధిత అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. డీఎస్‌ఏ పరిధిలో, క్రీడా పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా సమాచారం బయటకు రాకుండా సిబ్బంది, అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మెమో జారీ చేశాం..
బాక్సింగ్ శిక్షకునికి మెమో జారీ చేశాం. అ తని వివరణ తీసుకున్నాం. అంతర్గతంగా వి చారణ జరుపుతున్నాం. మా నివేదికతో పా టు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ నివేదికను కలెక్టర్‌కు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్‌వో