
నేటి నుంచి ‘సర్వేయర్’ అప్రెంటిస్‌షిప్
● ఒక్కో సర్వేయర్‌కు 15 మంది శిక్షణ అభ్యర్థులు అటాచ్డ్
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎంపిక చేసిన వారికి 56 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శిక్షణ ఇచ్చింది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 4నుంచి అప్రెంటిస్‌షిప్ అందించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు ఫలితాలు వెల్లడించలేదు. అయినా పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ అప్రెంటిస్‌షిప్ అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా జిల్లా సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైన 129 మందికి బుధవారం నుంచి అప్రెంటిషిప్ శిక్షణ ఇవ్వనున్నారు. మండల సర్వేయర్ల పరిజ్ఞానం, వారి పనితీరు ఆధారంగా ఒక్కో సర్వేయర్‌కు 15 నుంచి 21 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈమేరకు వారిని మంగళవారం కార్యాలయానికి పిలిపించారు. ఏ మండలంలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వివరాలు సేకరించారు. తదనుగుణంగా వారిని జిల్లాలో పనిచేస్తున్న 10 మంది సర్వేయర్లకు అటాచ్డ్ చేశారు. మంగళవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ పూర్తికాగా అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా వారి సర్వేయర్ పేరు, మండలం వంటి సమాచారం అందించనున్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే అభ్యర్థులందరికీ అప్రెంటిస్‌షిప్ ఇవ్వనుండటంతో అందరినీ విధుల్లోకి తీసుకుంటారా లేక ఫలితాల అనంతరం ఎవరినైనా రిజెక్ట్ చేస్తారా అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ఈ విషయమై జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్ ఏడీ రాజేందర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పది మంది సర్వేయర్లకు శిక్షణ అభ్యర్థులను అటాచ్డ్ చేశామని తెలిపారు. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.