
● అవగాహన కల్పిస్తున్న ‘సాధన సమితి’ ● మేము సైతం అంటున్న
ఆదిలాబాద్‌టౌన్: విశ్వవిద్యాలయం ఏర్పాటే లక్ష్యంగా యూనివర్సిటీ సాధన సమితి వడివడిగా అడుగులేస్తోంది. ఓ వైపు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ‘మేము మీ వెంట ఉన్నాం.. మీరు మా వెంట రండి.. మీ భవితకు బాటలు వేసుకోండని సూచిస్తున్నారు. సంఘటితంగా పోరాడితే లక్ష్య సాధన సులువేనని అంటున్నారు.
వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ..
యూనివర్సిటీ ఆవశ్యకతపై సాధన సమితి సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రంథాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓయూ, కేయూలు దూరంగా ఉండడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఏవిధంగా నష్టపోతున్నారు.. అదే ఇక్కడ వర్సిటీ అందుబాటులోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అందులో విద్యారంగం పాత్ర కీలకమని చెబుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి, కోకన్వీనర్ గొడిసెల రమణగౌడ్, సలహాదారులు, చిట్యాల సుహాసిని రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్, లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ సాధనకు తోడ్పాటునందించాలని కోరారు.
ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం..
వర్సిటీ సాధన సమితి ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సుల అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో విషయాన్ని ప్రస్తావించాలని విన్నవిస్తామని, సీఎంతో పాటు ఆయా శాఖల మంత్రులను కలుస్తామని సమితి సభ్యులు చెబుతున్నారు. వర్సిటీ సాధించేవరకు నిరంతరంగా ఉద్యమిస్తామని, శాంతియుత పోరాటాలు చేస్తామని పేర్కొంటున్నారు.