
● బడికి పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు
‘ఎఫ్‌ఆర్‌ఎస్’తో సమయపాలన
ఆదిలాబాద్‌టౌన్: బడులకు డుమ్మా కొట్టే, సమయపాలన పాటించని పంతుళ్లకు చెక్ పడింది. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) అటెండెన్స్ అమలులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేందుకు పాఠశాలలకు పరుగు పెట్టారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే చేరుకొని ఫేషియల్ అటెండెన్స్ నమోదు వేశారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు హాజరు వేసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ కారణంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రక్రియతో ఇష్టారీతిన బడికి వెళ్లే ఉపాధ్యాయుల ఆగడాలు ఇకపై సాగని పరిస్థితి. జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ ఫేషి యల్ అటెండెన్స్ వర్తింపజేశారు. విద్యార్థులతో పాటు టీచర్లు తమ ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లేవారు ఇదివరకు బస్టాండ్, తెలంగాణ చౌక్, ఠా కూర్ హోటల్, తాంసి బస్టాండ్‌లలో 9 నుంచి 10 గంటల వరకు కనిపించేవారు. శనివారం ఆ ఉపాధ్యాయులు ఉద యం 8 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి నిర్ణీత సమయంలోగానే పాఠశాలలకు చేరుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.