
బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ కొత్త నాటకం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: రాష్ట్రంలోని బీసీలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని బీసీ రిజర్వేషన్ల పేరిట కొత్త నాటకానికి హస్తం సర్కారు తెరలేపిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లను తెరమీదకి తీసుకువచ్చారని ఆరోపించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఆ పార్టీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంతవరకు ఆ పార్టీని బీజేపీ వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.