
బాలలు బడిలోనే ఉండాలి
● ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం ● 93 మంది బాలకార్మికులకు విముక్తి.. 28 కేసులు నమోదు ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: బాలలు బడిలోనే ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 93 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని, 28 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 86 మంది బాలురు, ఏడుగురు బాలికలను రక్షించినట్లు తెలిపారు. 70 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే 23 మంది పిల్లలను వసతిగృహాలకు తరలించి వారి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కార్మిక, విద్యా శాఖలతో పాటు చైల్డ్ ప్రొటక్షన్, ఎన్జీఓల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ నెలపాటు కాకుండా నిరంతరం సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమష్టి కృష్టితోనే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చన్నారు.
పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను తీసుకెళ్లాలి
పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను వాహనదారులు నిజధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆరు నెలల్లోగా తీసుకెళ్లాలని ఎస్పీ అన్నారు. జిల్లాలోని ఆయా స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి, పలుచోట్ల లభ్యమైన వాహనాలు 51 ఉన్నాయని తెలిపారు. 2026 జనవరి వరకు అవకాశం ఉందని, యజమానులు గమనించాలని సూచించారు. గడువు అనంతరం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మిగిలిన వాటికి బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. సందేహాలు ఉంటే రిజర్వు ఇన్‌స్పెక్టర్ మురళిని 8712659962 నంబర్‌పై సంప్రదించాలని సూచించారు.