
‘సీజనల్’పై అప్రమత్తంగా ఉండాలి
● వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ● రిమ్స్, ఉట్నూర్ ఆస్పత్రుల తనిఖీ
ఆదిలాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. డెంగీ బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం క్రోమ్ ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. విజిట్‌కు వచ్చే వైద్యుల వివరాలను డీఎంహెచ్‌వో కార్యాలయంలో నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీసీహెచ్‌ఎస్ ఉపేందర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
రిమ్స్ సేవలపై కమిషనర్‌కు ఫిర్యాదు
రిమ్స్‌లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అంద డం లేదని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్‌కు ఏబీవీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రిమ్స్ తనిఖీకి వచ్చిన కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీజీ వైద్యులు, సీఎంవో సమయపాలన పాటించడం లేదని, రోగులకు సరిగా సేవలు అందించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టి–హబ్ ద్వారా కేవలం పది రకాల పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో ఏబీవీపీ నాయకులు కార్తీక్, అజయ్, శశి ఉన్నారు.