
సమగ్ర ప్రణాళికతోనే ‘గిరిజన’ అభివృద్ధి
● బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీఎస్‌ఎస్ భవనంలో సోమవారం నిర్వహించిన గిరిజన సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయించాలని కోరారు. అలాగే పోడు భూముల విషయమై గిరిజనులతో పాటు గిరిజనేతరులకూ పట్టాలు మంజూరు చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని, బోథ్ నియోజకవర్గంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. గిరి వికాసం పథకం కింద సాగులో ఉన్న ప్రతీ ఎకరాకు నీరు, కరెంట్ అందించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు