
బంగారం ధరలకు రెక్కలు
● రూ.లక్ష మార్కు దాటిన 10 గ్రాముల పసిడి ● వెలవెలబోతున్న దుకాణాలు ● శ్రావణమాసంలో మరింత పెరిగే అవకాశం
ఆదిలాబాద్‌టౌన్: బంగారం పేరు వింటేనే గుండె గుబిల్లుమంటోంది. సామాన్యులకు అందనంత దూరంలో ధర పెరుగుతూనే ఉంది. మంగళవారం 10 గ్రాములు రూ.లక్ష మార్కు దాటింది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. 26 నుంచి నవంబర్ 30 వరకు శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉండడంతో పసిడి మరింత ప్రియం కానుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో వినియోగదారులు లేక దు కాణాలు వెలవెలబోతున్నాయి. అవసరం ఉంటే తప్పా కొనుగోలుకు జనం ముందుకు రావడం లేదు. పెళ్లిలో ఆభరణాలు తప్పనిసరి కావడంతో కొనుగో లు తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. పసిడితో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.
రూ.లక్ష దాటిన పసిడి ధర..
బంగారం 10గ్రాముల ధర మంగళవారం రూ.లక్ష 2వందలు పలికింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రూ.లక్ష ఉండగా, మధ్యాహ్నం తర్వాత రూ.200 పెరిగింది. ఆన్‌లైన్‌లో సా యంత్రం రూ.లక్ష 2వేలకు చేరిందని వ్యాపారులు చెబుతున్నారు. మే నెలలో ఒకసారి రూ.లక్ష 16వేలు ఉండగా, ఆ తర్వాత ధర తగ్గి రూ.96 నుంచి రూ.97వేల మధ్య కొనసాగింది. సోమవారం రూ. 99,400 ఉండగా, ఒకేసారి రూ.800 పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక వెండి ధర మంగళవారం కిలో రూ.లక్ష 17వేల 500 పలికింది. సో మవారం రూ.లక్ష 15వేలు ఉండగా, ఒకేరోజు రూ.2500 పెరిగింది. మూడు నెలల క్రితం వెండి కిలో రూ.90వేలు ఉండడం గమనార్హం. ధరలు భారీగా పెరగడంతో పట్టణంలోని బంగారు దుకాణాలు గిరాకీ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి.