
స్వచ్ఛతలో.. పూర్!
కై లాస్‌నగర్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ.. వెరసి ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛతలో అట్టడుగుస్థానానికి పరి మితమైంది. మూడేళ్లుగా పురోగతి సాధించి రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించిన బల్దియా ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 ర్యాంకుల్లో మాత్రం తడబడింది. పట్టణంలో చెత్త సేకరణ మొదలు.. పారిశుద్ధ్య పరమైన అన్ని విభాగాల్లో పనితీరు ఆశించిన మేర లేకపోవడంతో స్వచ్ఛతలో వెనుకబాటుకు గురైంది. రాష్ట్రస్థాయిలో అట్టడుగు స్థానానికి పడిపోగా, జాతీయ స్థాయిలో గతేడాదితో పోల్చితే 124 స్థానాలు పడిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రస్థాయిలో అట్టడుగుస్థానానికి ..
దేశంలోని నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛతలో పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జనాభా ఆధారంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ బల్దియా 50 వేల నుంచి 3లక్షల లోపు జనాభా కేటగిరీలో పోటీ పడింది. అయితే నిర్దేశించిన పారిశుద్ధ్య అంశాల్లో ప్రగతి కనబర్చడంలో విఫలమైంది. రాష్ట్రస్థాయిలో గతేడాది 11 ము న్సిపాలిటీల్లో 9వ ర్యాంకులో నిలువగా.. ఈ ఏడాది 40వ ర్యాంకుతో అట్టడుగుస్థానానికి పడిపోయింది. అలాగే జాతీయ స్థాయిలో గతేడాది 446 మున్సిపాలిటీలకు గాను 151వ స్థానంలో నిలిచింది. ఈ సారి 824 మున్సిపాలిటీలకుగాను 275వ ర్యాంకు సాధించడం గమనార్హం. గతేడాదితో పోల్చితే 124 స్థానా లు పడిపోయి స్వచ్ఛతపరంగా ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాల్లో ఓడీఎఫ్ డబుల్ ప్లస్ గుర్తింపును సొంతం చేసుకోవడం ఒక్కటే కాస్తా ఊరటనిచ్చే అంశం. మిగతా అన్ని అంశాల్లో వెనుకబడి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
అన్నింటా అధ్వాన పరిస్థితులే..
పట్టణాభివృద్ధి, పరిశుభ్రత, మరుగునీటి వ్య వస్థ, చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం,వినియోగం, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం ఆన్‌లైన్ సేవలపై అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం స్వచ్ఛత పురస్కారాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. ఆయా అంశాలను పరిశీలించేందు కోసం ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయిలోకి పంపిస్తోంది. ఆదిలాబాద్ మున్సి పల్ పరిధిలో సర్వేచేసిన బృందం అన్ని అంశాల్లోనూ అధ్వాన పరిస్థితులున్నట్లుగా గుర్తించింది. 12,500 మార్కులకు గాను ఈ పోటీ నిర్వహించగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ 7680 స్కోరు మాత్రమే సాధించి స్వచ్ఛత ర్యాంకులో వెనుకబడిపోయింది. పట్టణంలోని నీటి వనరుల వద్ద శుభ్రత, ప్రజా మరుగుదొడ్ల వినియోగంలో సున్నా స్కోరుకే పరి మితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా గే ఇంటింటి చెత్త సేకరణలో 31, వ్యర్థాలను వేరు చేయడంలో 39, వ్యర్థాల రీసైక్లింగ్‌లో 31, నివాస స్థలాల్లో 44 స్కోరు చూస్తే పారిశుద్ధ్య నిర్వహణకు బల్దియా అధికారులు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో స్పష్టమవుతుంది. ఉన్నతాధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలని లేకుంటే పారిశుద్ధ్య నిర్వహణ మరింత గతితప్పే ప్రమాదం లేకపోలేదని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయస్థాయిలో ఆదిలాబాద్‌కు 275వ ర్యాంకు
గతేడాదితో పోల్చితే 124 స్థానాలు డమాల్
బల్దియా అధికారుల పట్టింపులేమే కారణమా?
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన మహిళల కోసం నిర్మించిన మరుగుదొడ్లు ఇవి. ప్రారంభానికి పరిమితమయ్యాయే తప్ప ఇప్పటి వరకు తాళాలు తెరుచుకోకపోవడం గమనార్హం. వినియోగంలో లేక కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.