
విద్యలో నూతన ‘స్వరం’
● సర్కారు బడుల్లో సరిగమ పదనిసలు ● విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం ● పీఎంశ్రీ కింద ఎంపికై న బడులకు చేరిన సంగీత పరికరాలు
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమకు ఆసక్తి ఉన్న కళారంగాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి వారిలో కళా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. పీఎంశ్రీ పథకం కింద సంగీత పాఠాలను కూడా భాగస్వామ్యం చేసేందుకు పలు పాఠశాలలను ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయా పాఠశాలలకు తబల, హార్మోనియం, వయోలిన్, డోలక్ వంటి సంగీత పరికరాలు చేరుకున్నాయి. పిల్లల బుద్ధివికాసానికి, భావోద్వేగాల సమతూల్యతకు సంగీతం కీలక భూమిక పోషించనుంది. శిక్షకులను ఎంపిక చేసిన తర్వాత పాఠశాలల్లో విద్యతో పాటు సరగమ పదనిసలు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో..
జిల్లాలో డీఈవో పరిధిలో 676 పాఠశాలలు ఉన్నాయి. పీఎంశ్రీ పథకం కింద 24 పాఠశాలలు ఎంపిక కాగా, తొలివిడతగా 11 చోట్ల అమలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, వనరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎంపిక చేసింది. బడి అభివృద్ధితో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా నిధులతో పాటు సంగీత వాయిద్య, సైన్స్ పరికరాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు చూడదగ్గ ప్రదేశాల కోసం విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు గత విద్యా సంవత్సరంలో నిధులను విడుదల చేసింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం కింద ఐదేళ్ల వరకు పాఠశాల అభివృద్ధికి నిధులు సమకూరనున్నాయి. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల 25లక్షల వరకు విడుదల అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న పాఠశాలలకు సంగీత టీచర్ల నియామకం కోసం నిధులు విడుదల అ య్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.60వేల చొప్పున కేటాయించారు. నెలకు రూ.10వేల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణకు వెచ్చించనున్నారు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
జిల్లాలో తొలి విడతలో జెడ్పీఎస్‌ఎస్ ఇంద్రవెల్లి(బి), జెడ్పీఎస్‌ఎస్ ఇచ్చోడ, మోడల్‌స్కూల్ గుడిహత్నూర్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బోథ్, జెడ్పీఎస్‌ఎస్ బేల, మోడల్‌స్కూల్ బజార్‌హత్నూర్, మోడల్‌స్కూల్ నార్నూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1 విద్యానగర్, లక్కారం బాలికల ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల ఉట్నూర్, జెడ్పీఎస్‌ఎస్ యాపల్‌గూడ పాఠశాలలు ఎంపికయ్యాయి.
సంగీతంతో విద్యార్థుల్లో సృజనాత్మకత..
విద్యలో సంగీతాన్ని ఓ సాధనంగా భావిస్తున్న విద్యాశాఖ, విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంచే అంశంగా దీన్ని తీసుకుంటోంది. బాల్యంలోనే సంగీతం పరిచయమైతే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు..
ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యతో పాటు సంగీత పా ఠాలు బోధించేందుకు ప్ర భుత్వం చర్యలు చేపడుతుంది. పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 11 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆయా స్కూళ్లకు ఇప్పటికే సంగీత పరికరాలు చేరుకున్నాయి. టీచర్లను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. ఆరు నెలల పాటు శిక్షణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించనున్నారు. – రఘురమణ,
విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి

విద్యలో నూతన ‘స్వరం’