
● ఉద్యమ కార్యాచరణకు అడుగులు ● ‘వర్సిటీ.. కావాల్సిందే’ ప
మంగళవారం చర్చావేదిక అనంతరం అభివాదం చేస్తున్న వక్తలు
సాక్షి,ఆదిలాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో యూనివర్సిటీ సాధనకు అడుగులు పడుతున్నాయి. రాజకీయాలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ ప్రాంతవాసులు చిరకాల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అడవి బిడ్డల గొంతుకగా ‘సాక్షి’లో బుధవారం ‘వర్సిటీ.. కావాల్సిందే’ శీర్షికన ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రెండు దశాబ్దాల డిమాండ్..
విశ్వవిద్యాలయం.. ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పట్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్మల్ ప్రాంతంలో ఓ స్థాయిలో ఉద్యమం చేశారు. అప్పుడే జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం కూడా చేశారు. ఆ తర్వాత ఆయన మరణం, తెలంగాణ ఉద్యమ తీవ్రత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజన వంటి కారణాలతో అది అటకెక్కింది. ఆ తర్వాత ఇటీవల కేంద్రం నుంచి గిరిజన యూనివర్సిటీ ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు గంపెడాశతో ఎదురుచూశారు. అయితే ఆ వర్సిటీ కాస్త ములుగులో ఏర్పాటు కావడంతో ఉమ్మడి జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. అయినప్పటికీ విశ్వవిద్యాలయం సాధించాలనే బలమైన ఆకాంక్ష ఇక్కడి విద్యావంతులు, విద్యార్థి సంఘాలకు నాటుకుపోయింది. ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కార్యాచరణ కరువైంది. ఈ పరిస్థితుల్లో ‘సాక్షి’ జిల్లా కేంద్రంగా ‘యూనివర్సిటీ ఆవశ్యకత– సాధన కోసం ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చావేదిక’ను మంగళవారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇది కొండంత బలంగాతోచింది. ఇంకేముంది..పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అనేక విషయాలు వెలుగులోకి..
చర్చావేదికలో పాల్గొన్న వక్తలు తమ ప్రసంగాల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. యూనివర్సిటీ ఏ ర్పాటుపై గతంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి..తాజా పరిస్థితులను వివరించారు. గతంలో జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ మంజూరు చేశారని, ఆ ఫైల్‌ను మళ్లీ ముందుకు కదిపేందుకు అందరం ప్రయత్నించాంటూ వరప్రసాద్ పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు అంశంలో ఇప్పుడు కొత్త జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 27 డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, వంద కళాశాలలు ఉంటేనే ఈ అంశాన్ని ప్రభుత్వాలు ప రిశీలనకు తీసుకుంటాయని కె.పున్నారావు వివరించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు కూడా కలిసి వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్ప డం ఆలోచించేలా చేసింది. అయితే ప్రస్తుతం మంచిర్యాలకు కరీంనగర్‌లోని శాతవాహన, నిర్మల్‌కు నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీలు దగ్గరగా ఉండడంతో వారు కలిసి వస్తారా.. లేదా.. అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఈ చర్చా వేదిక ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
‘సాక్షి’కి ప్రశంసలు
ఈ ప్రాంతవాసుల ఆకాంక్షకు అనుగుణంగా బుధవారం ‘సాక్షి’లో చర్చా వేదిక కథనం ప్రచురితం కాగా పాఠకులతో పాటు జిల్లావ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తాయి. ‘సాక్షి’ ఇప్పటికే ఎయిర్‌పోర్టు సాధన కోసం చేసిన కృషిని ప్రశంసిస్తూనే తాజాగా విశ్వవిద్యాలయం అంశాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు.
ఇక ప్రణాళికాబద్ధ్దంగా..
వేదిక సందర్భంగా విద్యావంతులు, మేధావులు, నాయకులు ఐక్య పోరాటాల ద్వారానే లక్ష్యం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ సాధన కోసం కమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. వెంటనే అడ్‌హక్ కమిటీని ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణకు అడుగులు వేస్తామని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని వెల్లడించారు. అలాగే విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తాము వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

● ఉద్యమ కార్యాచరణకు అడుగులు ● ‘వర్సిటీ.. కావాల్సిందే’ ప

● ఉద్యమ కార్యాచరణకు అడుగులు ● ‘వర్సిటీ.. కావాల్సిందే’ ప

● ఉద్యమ కార్యాచరణకు అడుగులు ● ‘వర్సిటీ.. కావాల్సిందే’ ప