
‘జీవో 282’ రద్దు చేయాలి
కై లాస్‌నగర్: వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికుల పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనం. 282 వెంటనే రద్దు చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జీవో ప్రతులను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు వాటిని చించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వం పనిగంటల పెంపు జీవో జారీ చేయడం సరికాదన్నారు. కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కనీస వేతన జీవోలు సవరించాలన్నారు. కార్యక్రమంలో జగన్‌సింగ్, సురేందర్, పొచ్చన్న రమాకాంత్, చంద్రశేఖర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.