
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయ చాంబర్‌లో ఆ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాడుతున్న విద్యుత్‌తీగలు, వంగిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. 33కేవీ, 11కేవీ లైన్స్ పెట్రోలింగ్ చేసి సమస్యలు గుర్తించడంతో పాటు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డిష్, ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్స్ పోల్ చార్జీలు కట్టని పక్షంలో వారి నుంచి వెంటనే వసూలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అగ్రికల్చర్ సర్వీస్‌లను వెంటనే రిలీజ్ చేయాలని, ఆయా మండలాల అసిస్టెంట్ ఇంజినీర్స్ పెండింగ్ బిల్లులు వందశాతం వసూలు చేయాలన్నారు. ఇందులో డివిజనల్ ఇంజినీర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్ తదితరులు పాల్గొన్నారు.