
వర్షాలు అంతంతే
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జలాశయాల్లోకి క్రమంగా నీరు చేరుతుంది. జూన్‌లో జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షాపాతం నమోదైంది. ఆ నెలలో తక్కువ రోజులు మాత్రమే వర్షం కురిసింది. అది కూడా మోస్తరుగానే. జూలై ప్రవేశించినా ఇంకా ప్రాజెక్టులు, చెరువుల్లో పూర్తిస్థాయి జలకళ కనిపించడం లేదు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో అధిక వర్షపాతం, 19 జిల్లాల్లో సాధారణం, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో జిల్లా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.
ఇదీ పరిస్థితి
అల్పీపీడన ప్రభావంతో జిల్లాలో వానాకాలంకు ముందు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తర్వాత జూన్ మొదటి వారంలో తొలకరి పలకరించింది. అయితే మళ్లీ వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. అయితే చివరి వారంలో మంచి వర్షాలు కురవడంతో సాధారణ స్థితికి చేరుకుంది. జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు ఉన్నాయి. ఈ రెండింటిలో క్రమంగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుల కింద సుమారు 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా జల్లాలో వర్షాకాలంలో వర్షాధారంగానే పంటలు పండిస్తున్నా యాసంగిలో కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాల్సిన అవశ్యకత ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలోని చెరువుల కింద సుమారు 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అవి కూడా ఇంకా నిండని పరిస్థితి. వారం రోజులుగా సాధారణం నుంచి మోస్తారు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, ప్రాజెక్ట్‌ల్లోకి వరదనీరు వచ్చి చేరుతున్నప్పటికీ అవి ఇంకా పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకోలేదు.
జూన్‌లో సాధారణంగా నమోదు
ఈనెలలో చెదురుముదురుగానే..
భారీ వర్షాలు కురిస్తేనే పూర్తిస్థాయికి జలాశయాలు