
ఆటో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన రౌతు విక్కి ఈ నెల 19న రాత్రి తన ఇంటి ముందు ఆటోను పార్కింగ్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఆటో కనిపించకుండా పోయింది. దీంతో ఆయన చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై లాల్‌సింగ్ నాయక్ తెలిపారు.
నీలగిరి తోట దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని బిలోలిలోని సాయినేని సౌజన్య అనే మహిళా రైతుకు చెందిన నీలగిరి తోటకు మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. బాధిత మహిళ తనకున్న 22 ఎకరాల్లో కొన్నేళ్ల క్రితం నీ లగిరి చెట్లను నాటింది. మంగళవారం సాయంత్రం చెట్లకు నిప్పంటుకోవడంతో పదెకరాల్లో చెట్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహా రం అందించాలని బాధితురాలు కోరుతోంది.
ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన కొలాం, తోటి, కొలావర్ విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తి చేసినవారు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులలో ప్రవేశం పొందవచ్చన్నారు.