
వ్యాక్సిన్‌కు వెనుకంజ..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మళ్లీ కరోనా గుబులు రేపుతోంది. గత వారం, పది రోజులుగా రోజుకు ఒకట్రెండు కేసులు నమోదవుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో తీవ్ర నష్టాలు కలిగించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దాని ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ కేసులు మాత్రం నమోదయ్యాయి. చాలామంది ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వదంతుల వల్ల వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు జనాలు ముందుకు రావడం లేదు. కోవిడ్ నిబంధనలు పూర్తిగా మర్చిపోయారు. అప్రమత్తంగా ఉండకపోతే మరోమారు ముప్పు తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాక్సిన్‌కు వెనుకంజ..
కోవిడ్ ఉధృతి సమయంలో జనాలు వ్యాక్సిన్ కోసం కేంద్రాల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో జనాలు భయాందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాల్సిన వైద్యశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఐదారు నెలల నుంచి వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 5,52,815 మంది తీసుకోగా 101 శాతం నమోదైంది. రెండో డోస్ 5,55,884 మంది తీసుకోగా 101 శాతంగా నమోదైంది.
ప్రికాషన్ డోస్ 2,65,780 మంది తీసుకోగా, 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారు 37,631 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు వారు మొదటి డోస్ 24,877 మంది తీసుకోగా, రెండో డోస్ 23,534 మంది తీసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే బూస్టర్ డోస్ తీసుకునేందుకు మాత్రం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 20 చొప్పున మాత్రమే వ్యాక్సిన్‌లు పంపిణీ చేస్తున్నారు. వాటిని కూడా వేయించుకోకపోవడంతో వాటి గడువు ముగుస్తోంది. మార్చి వరకు 6 వేల కోవాగ్జిన్ వ్యాక్సిన్ రాగా ప్రస్తుతం ఏ ఆరోగ్య కేంద్రంలో కూడా నిల్వలు లేకుండా పోయాయి.
టెస్టులకు వెనుకంజ..
మొదటి, రెండో వేవ్‌లో లక్షణాలు ఉన్నవారు కోవిడ్ టెస్టులు చేసుకునేందుకు పీహెచ్‌సీలతో పాటు రిమ్స్ ఆస్పత్రిలో బారులు తీరారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రి తప్పితే అక్కడక్కడా ఒకరిద్దరు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వారం, పది రోజులుగా జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయని అంతగా పట్టించుకోవడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 5 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, ముగ్గురు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 92 మంది మృతి చెందగా, అనధికారికంగా 300 లకు పైగా ఉంటారని తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండాలి
కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించాలి. రెండు రోజుల్లో వ్యాక్సిన్ నిల్వలు అయిపోయాయి. రెండురోజుల్లో అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ వేసుకుంటే గుండెపోటు వస్తుందనేది అపోహ మాత్రమే.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో