breaking news
yadigiri gutta
-
గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరికొండ, న్యూస్‌లైన్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సెలవుదినం కావడం, అందులోనూ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ పెరిగింది. ధర్మదర్శనం, టికెట్టు దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ పరిసరాలు, సంగీత భవనం, గర్భాలయంలో భక్తులు కిక్కిరిసి పోయారు. స్వామి వారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారిని సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు అధిక సంఖ్యలో ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు -
కొండపై వైభవంగా లక్ష పుష్పార్చన
యాదగిరికొండ, న్యూస్‌లైన్: శ్రావణమాసం పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి మల్లే, జాజి మల్లే, మందారం, గులాబీ, బంతి, చామంతి, ఎర్రచామంతి, తెల్లచామంతి, విరజాజి తదితర లక్ష పుష్పాలతో మూడు గంటల పాటు సహస్రనామ పఠనం చేస్తూ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కృష్ణవేణి, ఆలయ అధికారులు దోర్భాల భాస్కరశర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాదగిరి స్వామి, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు గుట్ట దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి గజవాహన సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మండపంలో ఊంజల్ సేవ కోసం అధిష్టింపజేశారు. సేవకు ముందు మహిళలు అందమైన ముగ్గులు వేసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు అమ్మవారికి 108బంగారు పుష్పాలతో సహస్రనామార్చన నిర్వహించారు.