breaking news
World travelers
-
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రేపు పతంగుల పండుగ
వరంగల్‌లో మొదటిసారి అంతర్జాతీయ వేడుక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా సంబరాలు పాల్గొననున్న 31 దేశాల క్రీడాకారులు స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు నేడు నగరంలో హెరిటేజ్ వాక్ హన్మకొండ : వరంగల్‌లో తొలిసారి జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగకు ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా మంగళవారం పతంగుల పండగ జరగనుంది. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్ వైపు ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ పండుగ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలనే భావనతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల క్రీడాకారులు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగలో 31 దేశాల నుంచి ఔత్సాహిక పంతగుల క్రీడాకారులు పాల్గొననున్నారు. అలాగే, మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది మంది క్రీడాకారులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పతంగుల పండుగ వివరాలు, ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం వరకు ఈ హెరిటేజ్ వాక్ జరగనుంది. అలాగే, మంగళవారం కూడా ఉదయం 6.30 గంటలకు ఖిలా వరంగల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అనంతరం అల్పాహారం చేశాక పతంగులు ఎగురవేస్తారు. కాగా, పతంగుల పండుగ జరిగే చోట క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జర్రీస్, పెంబర్తి కళాఖండాలు, చేర్యాల నఖాసీ చిత్రాలు, హస్తకళలు, చేనేత ఉత్పత్తులను 30 స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. -
కిందకు చూస్తే కళ్లు తిరగడం ఖాయం
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్వత శిఖరాగ్రాలపై వినూత్న కట్టడాలను నిర్మించడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. బీజింగ్ నగరానికి కేవలం 43 మైళ్ల దూరంలో వున్న జింగ్‌డాంగ్ స్టోన్ ఫారెస్ట్ వద్ద 1300 అడుగుల అతిపెద్ద లోయను పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించడం కోసం వృత్తాకారంలో 4,467 చదరపు అడుగుల విస్తీర్ణంగల గ్లాస్ ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పొడవైనఈ నిర్మాణాన్ని పర్యాటకుల వీక్షణ కోసం గతవారమే ప్రారంభించింది. పర్వత శిఖరాగ్రానికి ఏటవాలుగా 107 అడుగుల దూరంలో ఏర్పాటుచేసిన ఈ గ్లాస్ ప్లాట్‌ఫామ్ అమెరికాలోని గ్రాండ్ కాన్యన్లో ఉన్న 37 అడుగుల గ్యాస్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్కన్నా పెద్దది. ఈ సరికొత్త గ్లాస్ ప్లాట్‌ఫామ్ మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది. ఇది ప్రపంచంలో అతిపెద్దదే కాకుండా అతి పొడవైన గ్లాస్ ప్లాట్‌ఫామ్. అంతేకాకుండా విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టైటానియంతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. టైటానియం ఎంతో తేలికగా ఉండడంతోపాటు ఎంతో మన్నికైంది. పర్యాటకుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, అందుకనే టైటానియంను ఉపయోగించామని చైనా అధికారులు తెలిపారు. గత ఆదివారం దీన్ని ప్రారంభించినప్పుడు తొలి సందర్శకులు దీనిపైకి వెళ్లేందుకు ఎంతో భయపడ్డారని, ఆ తర్వాత ఎంతో థ్రిల్ ఫీలయ్యారని వారు చెప్పారు. -
సాహసం... సుందర వీక్షణం...
మబ్బులను చేత్తో అందుకోవాలి.. మంచులో జారుతూ సాగిపోవాలి.. ఎత్తై కొండలను అధిరోహించాలి.. లోతైన లోయల సౌందర్యాన్ని వీక్షించాలి.. వాహనమే లేని చోట గుర్రపు స్వారీ చేయాలి.. తేయాకు తోటల్లో విహరించాలి. ఈ వేసవి విహారంలో ఓ కొత్త అనుభూతిని పొందడానికి మన దేశంలోనే ఎన్నో అరుదైన, అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి... ముస్సోరీలో ట్రెక్కింగ్ కొండ ప్రాంతాలలో సుదీర్ఘమైన నడకను ఓ సాహసకృత్యంగా పర్యాటకులు భావిస్తారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా ముస్సోరీలో ట్రెక్కింగ్‌కు వెళ్ళిన పర్యాటకులు మర్చిపోలేని అనుభూతిని వెంటమోసుకెళతారు. హిమాలయ పర్వతాల్లో ఎత్తై హిల్ స్టేషన్ ముస్సోరీ. మీ వేసవి సెలవులకు ఇది సరైన వేదిక. ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తలు సైతం తమ కుటుంబా లతో ఇక్కడ ఆనందపుటంచుల్లో విహరించినవారే! భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఈ ప్రాంతం రెండవ ఇల్లుగా ఉండేది. రస్కిన్ బాండ్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తన రచనల్లో కళ్లకు కట్టారు. దారి పొడవునా పైన్ వృక్షాలు, పెద్ద పెద్ద జలపాతాలు, సుగంధాలను వెదజల్లే చందనపు వృక్షాలు.. ఇక్కడ ప్రకృతి సోయగానికి చూపుతిప్పుకోలేరు. ఈ పొడవైన దారిలో ట్రెక్కింగ్‌కి వెళ్లేవారు 400 ఎకరాలలో వన్యప్రాణులకు నిలయమైన ‘క్లౌడ్ ఎండ్ ఎస్టేట్’ను కూడా సందర్శించవచ్చు. ఇదో ప్రైవేట్ ఎస్టేట్. ఇక్కడ అరుదైన పక్షులను తిలకించవచ్చు. వసతి సౌకర్యం పొందాలంటే మాత్రం ‘వెర్మొంట్ ఎస్టేట్’లో పాత విల్లాలున్నాయి. ఇందులో ఇద్దరికి (రోజుకు) రూ.8,500కు వసతి లభిస్తుంది.ఢిల్లీ నుంచి 8 గంటలు ప్రయాణించి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ పట్టణానికి చేరుకొని, అక్కడ నుంచి కొండలలో రాణిగా పిలవబడే ముస్సోరీకి వెళ్లాలి. ఢిల్లీ నుంచి ముస్సోరీకి రెండు గంటలు పట్టే ఈ దూరానికి టాక్సీలో బయల్దేరాలంటే (ఒకరికి) రూ.4,700 లు ఖర్చు అవుతుంది. సాహసవీరులకు గుల్మార్గ్... హిమాలయ పర్వతాల్లో నునుపైన మంచుకొండల మీదనుంచి జారిపోతూ, గాలిలో తేలిపోతూ ఆకాశమే హద్దుగా ప్రపంచ పర్యాటకులు రెచ్చిపోయే ప్రదేశం గుల్మార్గ్. కాశ్మీర్ లోయల్లోని గుల్మార్గ్ గగనవీధుల్లో ఒకరోజంతా రోప్‌వేలో తేలిపోవాలంటే (ఒకరికి) రూ.2,500 ఖర్చు అవుతుంది. మొదటిసారి ‘స్కయింగ్’ కోర్సు తీసుకోవాలనుకుంటే మాత్రం రూ.5,000 చెల్లించాలి. ఇక్కడ పర్యాటకుల వసతి కోసం కొత్త కొత్త హోటళ్లు వెలిశాయి. గుల్మార్గ్లో ముందస్తు వసతి సదుపాయం పొందాలంటే జెకెటిడిసి (జమ్ముకాశ్మీర్) పర్యాటకశాఖ వారి ఫోన్ నెంబర్లు: +91 09419708180, +9101 954254487, 254439. గుల్మార్గ్లోని హె ఖైబర్ హిమాలయన్ రిసార్ట్, స్పా ఫోన్ నెంబర్: +91-1954254666.Email : reservations@khyberhotels.com శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. షాహ్ ట్రావెల్స్‌లో ఒకరికి, ఒక వైపు ప్రయాణానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. బిర్‌లో గగన విహారం... మబ్బులను అందుకునేంత ఎత్తులో విహరించాలని ఉందా! అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలధర్ కొండల్లోని ‘బిర్’ ప్రాంతానికి వెళ్లాలి. జీవావరణ, సాహసవిన్యాసాల పర్యటనకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ భూమి నుంచి 11,500 అడుగుల ఎత్తులో పారాచూట్ (పారాగ్లైడింగ్)లో విహరిస్తూ మబ్బులను అందుకోవచ్చు. సుశిక్షితులైన నిపుణుల పర్యవేక్షణలో ఈ గగన విహారపు అనుభూతిని ఆసాంతం పొందవచ్చు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, కొండల అంచులను, లోయలనూ వీక్షించవచ్చు. పశ్చిమ హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ‘బిర్’ ఒక గ్రామం. ఇక్క టిబెట్ దేశ శరణార్థులు, బౌద్ధ స్థూపాలను చూడవచ్చు. పారాచూట్ విహారానికి తగిన సామాగ్రిని పిజి-గురుకుల్ వారు అమర్చుతున్నారు. ఒకసారి విహరించడానికి రూ.2,000 ఖర్చు అవుతుంది. దీనికి తగిన శిక్షణ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. బిర్బిల్లింగ్ నుంచి చండీగడ్‌కు పారాచూట్లో నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ‘కొలనెల్స్ రిసార్ట్’ ఉంది. ఇందులో ఇద్దరు బస చేయడానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతంలో టిబెటన్ కాలనీలో ఇళ్లతో పాటు, స్థానిక సంస్కృతి, టిబెటన్ హస్తకళల కేంద్రం, టిబెటన్ పిల్లల గ్రామీణ పాఠశాల, వైద్య, జ్యోతిశ్శాస్త్ర కేంద్రాలను సందర్శించవచ్చు.ఢిల్లీ నుంచి కంగ్రా వ్యాలీ.. అటు నుంచి అహ్జుకు టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బిర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం. ప్రకృతి ప్రేమికులకు కూనూరు... నీలగిరి పర్వతశ్రేణులు, తేయాకు తోటలు, దగ్గరలో ఊటీ పచ్చ సోయగం కూనూరుకు వెళ్లినవారి కనులకు విందుచేస్తాయి. సేంద్రీయ పద్ధతులతో పండించిన తాజా ఆహారపదార్థాలను ఇక్కడ కడుపారా ఆరగించవచ్చు. కూనూరు నుంచి ఊటీ వెళ్లేదారిలో నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో విహరిస్తూ ఆ ఆహ్లాదాన్ని పొందవచ్చు. కూనూరుకు దగ్గరలో అతిపెద్ద తేయాకు పరిశ్రమ, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్, టైగర్ హిల్, డ్రూగ్ ఫోర్ట్, సిమ్స్ పార్ట్, ర్యాలీ డ్యామ్, లాస్ జలపాతం, గోల్ఫ్‌కోర్స్.. వంటివెన్నో సందర్శించదగ్గవి. ► కోయంబత్తూరులో విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా కోయంబత్తూర్‌కు చేరుకోవచ్చు. ► కోయంబత్తూర్, చెన్నైలకు హైదరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది. ► రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బెంగళూర్ 870 కి.మీ., అటు నుంచి కొడెకైనాల్ 256 కి.మీ., అటునుంచి కోయంబత్తూరు 104 కి.మీ. విదేశాలకు వెళుతున్నారా? ట్రావెల్ ఇన్స్యూరెన్స్, క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, ట్రావెలర్స్ చెక్... ఇవి ఉన్నాయా అనేది తప్పనిసరిగా సరిచూసుకోండి. ♦ ట్రావెలర్స్ చెక్స్ ఎందుకంటే... నగదు రూపంలో డబ్బు వెంట ఉంటే దారిలో పోవచ్చు. దొంగిలించబడవచ్చు. ఈ సమస్య ఎదురుకాకుండా విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ‘ట్రావెల్స్ చెక్స్’ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడైనా ఈ చెక్స్ పోయినా, సదరు సంస్థకు ఫోన్ చేసి నెంబర్‌ను రద్దు చేసుకోవచ్చు. ట్రావెల్చెక్స్ ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే సదుపాయముంది. క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ తీసుకోండి... విదేశాలలో క్రెడి ట్ కార్డ్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డులు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఉపయోగించుకోవడానికి వీలుండే కార్డులు (పరిమితులను బట్టి) ఈ రెండూ. ఈ ప్రీపెయిడ్ కార్డు వినిమయానికి బ్యాంక్ ఛార్జీలు వర్తించవు. ఈ కార్డ్‌ను వెంట తీసుకెళ్లడం సులువు, సురక్షితం కూడా! ♦ ట్రావెల్ బీమా తప్పనిసరి... కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయాణికుల కోసం బీమా భద్రత కల్పిస్తుంటాయి. వీటిని ఉపయోగించుకోవడం మేలు. లగేజీ పోయినా, అత్యవసర వైద్యసాయం పొందాలన్నా, ఊహించని ప్రమాదాలు జరిగినా... ఈ బీమా మీకు ధీమా కల్పిస్తుంది.