breaking news
Wang yihan
-
సింధు నాదం
{పపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సింగిల్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశం నేడు ఒకుహారాతో అమీతుమీ గెలిస్తే కొత్త చరిత్ర పది రోజులు దాటిపోయినా రియో ఒలింపిక్స్‌లో తొలి పతకం కోసం ఎదురుచూపులు చూస్తున్న భారత్‌కు పీవీ సింధు ఆశాకిరణంలా ఉదయించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రియోకు వెళ్లిన సింధు... సంచలన ఆటతీరుతో క్వార్టర్స్‌లో చైనా ‘గోడ’ను అధిగమించి సెమీస్‌కు చేరింది. ఇక ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు... భారత్ ఖాతాలో పతకం చేరుతుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం ఆడుతుంది. రియో డి జనీరో: పతకం రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు అద్వితీయ ఆటతీరును ప్రదర్శించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు 22-20, 21-19తో రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించింది. యిహాన్ వాంగ్‌పై సింధు కెరీర్లో ఇది వరుసగా రెండో విజయం. గతేడాది డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ యిహాన్ వాంగ్‌పై సింధు గెలిచింది. తాజా విజయంతో సింధు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గత లండన్ ఒలింపిక్స్‌లో సైనా సెమీఫైనల్లో యిహాన్ వాంగ్ చేతిలో ఓడి... ఆ తర్వాత ప్లే ఆఫ్‌లో చైనా ప్లేయర్ జిన్ వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్యం సాధించింది. హోరాహోరీ పోరు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను ఓడించిన సింధు అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ప్రత్యర్థి ర్యాంక్‌ను, ఆమె అనుభవాన్ని చూసి బెదరకుండా తన సహజశైలిలో వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ఆడింది. ఆరంభంలో 0-3తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకొని స్కోరును 5-5తో సమం చేసింది. విరామ సమయానికి సింధు 8-11తో వెనుకంజలో ఉన్నా... తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకుంటూ స్కోరును మరోసారి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడింది. సింధు 20-18తో ఆధిక్యంలో ఉన్న సమయంలో యిహాన్ రెండు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసింది. అయితే సింధు క్రాస్‌కోర్టు రిటర్న్ షాట్‌తో ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే యిహాన్ వాంగ్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో అదే జోరు అనుభవజ్ఞురాలైన యిహాన్‌ను తేరుకోనిస్తే ఇబ్బంది తప్పదనుకున్న సింధు రెండో గేమ్‌లోనూ దూకుడుగానే ఆడింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ 8-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగిస్తూ 18-13తో మరింత ముందుకు వెళ్లింది. ఈ దశలో యిహాన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-18తో ముందంజ వేయడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. కానీ సింధు కీలకదశలో తప్పిదాలు చేయకుండా సహనంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. యిహాన్ వాంగ్‌ను ఓడించి సింధు తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించింది. నా అంచనా ప్రకారం సింధులో మరింత మెరుగ్గా రాణించగల సత్తా ఉంది. ఒకట్రెండు అంశాల్లో కొంత మెరుగుపడాలి. ఆటపట్ల అంకితభావమున్న పోరాట యోధురాలు సింధు. - గోపీచంద్ (కోచ్) ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో యిహాన్ వాంగ్‌ను ఓడించడం ప్రత్యేక అనుభూతి. నా కెరీర్‌లోని మధుర క్షణాల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటి. కీలక దశలో సహనం కోల్పోకుండా ఆడి మంచి ఫలితాన్ని సాధించాను. ప్రస్తుతం నా దృష్టి సెమీస్‌పైనే ఉంది. అందులోనూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. బాగా ఆడితే గెలుస్తాను. పతకం వస్తుంది. - సింధు -
సైనా... కాంస్యంతో సరి
సెమీస్‌లో పరాజయం వుహాన్ (చైనా): తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ చేతిలో 11వ సారి ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 16-2, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించిన ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీస్‌లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. గతంలో యిహాన్పై నాలుగుసార్లు నెగ్గిన సైనా తొలి గేమ్‌లో ఒకదశలో 9-6తో ముందంజలో ఉంది. అయితే యిహాన్ పుంజుకొని రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అటునుంచి సైనా తేరుకోలేకపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా కాంస్య పతకం నెగ్గడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి సైనాకు కాంస్య పతకం దక్కింది. ఈ ఈవెంట్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా సైనా గుర్తింపు పొందింది. -
సింధు సంచలనం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కేవలం 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-12, 21-15తో తై జు యింగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతంలో తై జు యింగ్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన సింధు ఈసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండు గేముల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న సింధు మ్యాచ్ సాగుతున్నకొద్దీ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడుతుంది.