breaking news
Transfer eliminated
-
మూకుమ్మడిగా బదిలీ వేటు!
ఒకేసారి 18 మంది పంచాయతీ విస్తరణాధికారుల బదిలీ 16 మందికి ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు మరో ఇద్దరికి నవంబర్ 22వ తేదీతో ఉత్తర్వులు పరిపాలనాపరమైన కారణాలని అధికారుల సాకు ఒకేసారి ఇంతమందికా అని ఉద్యోగుల విస్మయం ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఫలితమేనని ఆరోపణలు శ్రీకాకుళం: సాధారణ బదిలీలు జరిగి నెల రోజులైనా కాకముందే జిల్లా పంచాయతీ శాఖలో పరిపాలన అవసరాల ముసుగులో మరోమారు బదిలీలకు తెర తీశారు. ఆ సాకుతో 16 మందిపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నెల 20వ తేదీతో జారీ ఉత్తర్వులతో జిల్లాలో 16 మంది పంచాయతీ విస్తరణాధికారులు బదిలీ కాగా, గత నెల అంటే నవంబర్ 22వ తేదీతో ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఇద్దరిని బదిలీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే హుద్‌హుద్ తుపాను కారణంగా పంచాయతీ విస్తరణాధికారులు బిజీ అయ్యారని, అందుకే అప్పట్లో బదిలీలు చేయలేదని సాకులు చెబుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరమైన కారణాలతో బదిలీ చేయాలంటే సదరు ఉద్యోగి ఇప్పటికే ఒకటి రెండు షోకాజ్ నోటీసులు వంటివి అందుకొని ఉండాలి. విధులకు తరచూ డుమ్మాకొడుతున్నట్టు గానీ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు గానీ ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీ అయిన ఉద్యోగులు నెల రోజుల వ్యవధిలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు. కానీ పరిపాలనా పరమైన కారణాల పేరుతోనే వారిని బదిలీ చేశారు. అది కూడా సుదూర ప్రాంతాలకు పంపించారు. ఈ బదిలీల వెనుక ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అనుచరుల ఒత్తిడి మేరకు ఆ నాయకుడు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ అకాల బదిలీలు జరిగాయని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. జలుమూరు పంచాయతీ విస్తరణాధికారిని సీతంపేటకు, ఎల్.ఎన్.పేట విస్తరణాధికారిని నందిగాంకు, సీతంపేట విస్తరణాధికారిని రేగిడికి, అక్కడి విస్తరణాధికారిని కవిటికి, కవిటి విస్తరణాధికారిని ఎల్.ఎన్.పేటకు, సంతబొమ్మాళి విస్తరణాధికారిని వీరఘట్టానికి, వంగర విస్తరణాధికారిని పొందూరుకు, కంచిలి విస్తరణాధికారిని జలుమూరుకు బదిలీ చేసినట్లు తెలిసింది. వీరందరికీ ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఆమదాలవలస పంచాయతీ విస్తరణాధికారిని శ్రీకాకుళం రూరల్ మండలానికి, శ్రీకాకుళం రూరల్ మండల పంచాయతీ విస్తరణాధికారిని పాలకొండకు బదిలీ చేశారు. వీరిద్దరికీ మాత్రం గత నెల 22వ తేదీతో ఉత్తర్వులు రావడం గమనార్హం. దీనిపై జిల్లా పంచాయతీ అధికారిణి సెల్వియాను ఫోన్లో వివరణ కోరగా పరిపాలనా పరమైన బదిలీలు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. ఇటువంటి బదిలీలకు ప్రభుత్వ ఆంక్షలు వర్తించవన్నారు. -
అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై బదిలీ వేటు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొమ్మనలేక పొగ పెట్టినట్లు.. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని జిల్లా అధికారులు మూకుమ్మడిగా బదిలీ చేశారు. వాస్తవానికి వీరికి బదిలీలు ఉండవు, ఎక్కడ నియమిస్తే అక్కడే విధులు నిర్వర్తిస్తారు. సంబంధిత కాంట్రాక్టర్ వారికి జీతాలు చెల్లిస్తారు. అయితే టీడీపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖలో 2004 నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ అపరేటర్లలో 53 మందిని దూరప్రాంతాలకు ఆకస్మికంగా బదిలీ చేసింది. దీని వెనుక జిల్లా మంత్రి, ఆయన ఓఎస్డీ, కొందరు అధికారుల కుట్ర ఉందని సదరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చేదే అరకొర జీతం.. అది కూడా పది నెలలుగా మంజూరు కాలేదు, అయినా నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కార్యాలయాల్లో ఉంటూ కష్టపడుతున్న తమను బదిలీ చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. జీతాలు చెల్లించే విషయంలో చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు బదిలీల పుణ్యం కట్టుకున్నారని ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన చోటుకు వెళ్లని వారిని ఆ సాకుతో తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు మంత్రి, ఆయన ఓఎస్డీ ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అందుకే నిబంధనలు లేకపోయినా దూరప్రాంతాలకు బదిలీ చేశారని అంటున్నారు. ఎప్పుడో వచ్చే అరకొర జీతాలతో దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. మీరు చేరకపోతే.. కొత్తవారు వస్తారని ఇప్పటికే కొందరు తహశీల్దార్లు వ్యాఖ్యానించడాన్ని బట్టి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించమని వారిపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల తోపాటు కలెక్టరేట్లో మొత్తం 64 మంది అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. కలెక్టరేట్లో పనిచేస్తున్న వారు మినహా మిగతా 53 మందిని బదిలీ చేశారు. ఈ బదిలీల తీరును కొందరు టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.