breaking news
terror charges
-
కాబోయే మహిళా టెర్రరిస్టు అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకు స్పెయిన్ వచ్చిన ఓ యువతి (18)ని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. గండియా పట్టణంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. జీహాదీ భావనలను ప్రచారం చేయడం, ఉగ్రవాద చర్యలను సమర్థించడం, ఐఎస్ఐఎస్ చేస్తున్న హత్యలను పొగుడుతూ వీడియోలు పెట్టడం లాంటి చర్యలు చేస్తూ.. ఆ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తోందని స్పెయిన్ భద్రతా దళాలు తెలిపాయి. ఆమె త్వరలోనే సిరియాకు వెళ్లి, అక్కడ ఐఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఒక్క సంవత్సరంలోనే స్పెయిన్‌లో ఇప్పటివరకు అరెస్టు చేసిన జీహాదీ మద్దతుదారుల సంఖ్య 49కి చేరింది. కాగా, ఇటీవలి కాలంలోనే దాదాపు 125 మంది స్పెయిన్ నుంచి బయల్దేరి సిరియా, ఇరాక్ దేశాలలో ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఉగ్రవాద ఆరోపణలతో భారత సంతతి మహిళ అరెస్టు
భారత సంతతికి చెందిన ఓ మహిళను లండన్‌లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ అనంతరం కుంతల్ పటేల్ (36)ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు, ఉగ్రవాద నిరోధ అధికారులు కలిసి శని, ఆది వారాలలో లండన్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అనంతరం తగిన ఆధారాలు లభించడంతో కుంతల్ పటేల్‌ను అరెస్టు చేశామన్నారు. ఆమెను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు. దక్షిణ లండన్‌లోని స్ట్రీట్హామ్ హిల్ ప్రాంతంలో గల వయట్ పార్క్ రోడ్డులోని రెండు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. దాంతోపాటు స్ట్రాఫర్డ్లో కూడా సోదాలు చేసి, అక్కడే కుంతల్‌ను అరెస్టు చేశారు. ఓ బ్రిటిష్ దౌత్యవేత్త కుమారుడిని (19) కూడా పోలీసులు ఇదే సందర్భంలో అరెస్టు చేశారు. అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ చెప్పలేదు. తర్వాత బుధవారం రాత్రి కుంతల్ పటేల్‌పై ఆరోపణలు చేశారు. వీరిద్దరినీ ఉగ్రవాద నిరోధ, నేర నిరోధ, భద్రతా చట్టం -2011 కిందే అరెస్టు చేశారు. కుంతల్ పటేల్ బ్యాంకర్ కాగా, ఆమె తల్లి మీనా పటేల్ ఓ మేజిస్ట్రేట్. వీరి కుటుంబం చాలా గౌరవప్రదమైనదని, కుంతల్, ఆమె చెల్లెలు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేప్పటి నుంచి తనకు తెలుసని వారి కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. అయితే వీరిపై ఉగ్రవాద ఆరోపణలు చేయడానికి కారణాలేంటో, పోలీసులకు లభించిన ఆధారాలేంటో మాత్రం ఇంకా తెలియరావడంలేదు.