breaking news
temple priest attacked
-
ఆలయ పూజారి దారుణ హత్య
జైపూర్: రాజస్తాన్‌లో ఆలయ భూముల కబ్జాను అడ్డుకుంటున్న ఓ పూజారిని దారు ణంగా హత్య చేసిన ఘటన బుధవారం జరిగింది. కరౌలీ జిల్లాలోని బుక్నా గ్రామంలో ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఆలయ పూజారి బాబూలాల్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునేవారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవనే కక్షతో కబ్జాదారులు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. ఆలయ పూజారి హత్యకు గురికావడం దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పూజారి హత్యోదంతంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడం బదులు రాజస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో దారుణంగా విఫలమైందని జవదేకర్ విమర్శించారు. పూజారి ప్రాణాలను బలిగొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
పూజారిపై దాడి.. ఆలయ సామగ్రి ధ్వంసం
తమిళనాడులోని ఈరోడ్‌లో జైన దేవాలయం పూజారిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి, ఆలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు కారులో రాగా మరో ఇద్దరు ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ముగ్గరుఇలో ఒకరు బాగా తప్పతాగి ఆలయంలోకి వస్తుండగా పూజారి ఆపి ప్రశ్నించారు. వెంటనే అతడు పూజారిపై తనవద్ద ఉన్న సీసాతో దాడి చేయడంతో ఆయన ఎడమ చెవికి తీవ్రగాయమైంది. అనంతరం ఆ ముఠా సభ్యులు లోపలున్న సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే అదృష్టవశాత్తు గర్భగుడి తలుపులు మాత్రం తాళం వేసి ఉండటంతో వాళ్లు ఆ లోపలికి ప్రవేశించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఇక్కడ గొడవ విన్న స్థానికులు వెంటనే అక్కడకు రావడంతో ముగ్గురూ మోటారు సైకిళ్ల మీద పారిపోయారు. నిందితులను అరెస్టు చేయాలంటూ స్థానికులు రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు.