‘తెలంగాణ’ పత్రిక ఇక ఇంగ్లిష్‌లో
తొలి కాపీ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక ‘తెలంగాణ’ ఇక నుంచి ఇంగ్లిష్ భాషలో వెలువడనుంది. ఈ మేరకు పత్రిక తొలి కాపీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు, విషయ పరిజ్ఞానం పెంచేం దుకు పత్రిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యం కల్పించాలని, తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలు, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సీఎం పీఆర్వోలు పాల్గొన్నారు.