breaking news
tdp coordination committee meet
-
జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ చిత్తూరు కలెక్టరేట్/సాక్షి ప్రతినిధి, అనంతపురం :రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహరెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో.. విభజన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఓట్ల లెక్కింపును గురువారం ప్రారంభించింది. పశ్చిమ రాయలసీమలో.. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి 25,272 ఓట్లు పోలయ్యాయి. నిబంధనల మేరకు ఓట్లు వేయకపోవడంతో లెక్కింపు సమయంలో 3,867 ఓట్లు చెల్లకుండా పోయాయి. తర్వాత మిగతా ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి మంచి ఆధిక్యం చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి 8,846 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 6,853 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 4,162 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి ఎవరూ 50 శాతం ఓట్లను సాధించకపోవడంతో.. తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను ఒక్కొక్కరిని తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. లెక్కింపు ముగిసే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా.. ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. అప్పటికీ 50 శాతం ఓట్లు సాధించక పోవడంతో ఎన్నికల సంఘం అనుమతితో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ ప్రకటించారు. తూర్పు రాయలసీమలో.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌లో 24,291 ఓట్లు పోలయ్యాయి. 2,356 ఓట్లు చెల్లలేదు. మిగతా ఓట్లలో మొదటి ప్రాధాన్యతలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 10,892 ఓట్లు సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఆరుగురు అభ్యర్థులను వరుస క్రమంలో తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి 11,714 ఓట్లు, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1,043 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారని రిటర్నింగ్ అధికారి హరినారాయణన్ ప్రకటించారు. కాగా, చిత్తూరు, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద తుది ఫలితం వెల్లడికాగానే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తపరిచారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం టీచర్ల సమస్యల పరిష్కారానికి దోహదం తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంపై ఉద్యోగ సంఘాల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఏపీ జీఈఎఫ్, వైఎస్సార్సీపీ, పీఆర్టీయూ ఏపీ అపుస్మా, వైఎస్సార్‌టీఎఫ్ తదితర 36 సంఘాల మద్దతుతో పోటీ చేసిన తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఎం. వి.రామచంద్రారెడ్డి గెలుపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సుల వల్లే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ విజయం దోహద పడుతుందని చెప్పారు. వారధిగా పనిచేస్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతోనే గెలుపొందాను. ప్రభుత్వానికి, ప్రభుత్వ.. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యా రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. – ఎంవీ రామచంద్రారెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్ల పక్షాన ఉంటా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విద్యా రంగ అభివృద్ధే నన్ను ఎమ్మెల్సీని చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో విద్యాభివృద్ధి జరుగుతోంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
అంతా మీ వల్లే..
సాక్షి, గుంటూరు : ‘అంతా మీ వల్లే.. అధికారంలో ఉండి పదవులు అనుభవించి కార్యకర్తలను విస్మరించారు.. పార్టీ కోసం కష్టపడిన వారిపైనే రౌడీషీట్లు తెరిపించారు.. పార్టీ వాస్తవ పరిస్థితుల గురించి ముఖ్య నేతలకు వివరిస్తుంటే తరువాత చూద్దాంలే అంటూ దాటవేశారు.. ఎమ్మెల్యేలు, మంత్రులు భజన కోటరీలను ఏర్పాటు చేసుకొని కార్యకర్తలను దగ్గరకు రానీయలేదు..’ అందుకే ఘోర ఓటమి ఎదురైంది అంటూ తెలుగు తమ్ముళ్లు నిరసన గళం వినిపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోరంగా ఓటమి పాలైన టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. అయితే ఓటమిగల కారణాలపై నాయకులు పరస్పర దూషణలకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్, అనగాని సత్యప్రసాదు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర, మాకినేని పెదరత్తయ్య, చదలవాడ అరవిందబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ అధికారంలో పదవులు అనుభవించిన వారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించారని దుయ్యబట్టారు. నరసరావుపేటకు చెందిన ద్వితీయశ్రేణి నాయకుడు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిపైనే రౌడీషీట్లు తెరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టి అభ్యర్థి ఓటమికి కారణం అయ్యారన్నారు. ప్రత్యర్థి పార్టీ కంటే సొంత పార్టీ వాళ్లే ఓడించారన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే జిల్లా సభ్యత్వాలు కట్టించడంలో ప్రథమస్థానం సాధించామని, ఓట్లు వేయించటంలో మాత్రం విఫలమయ్యామని పేర్కొన్నారు. పదవుల కోసం ఆరాటం తప్పితే కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. పార్టీలో ద్వీతీయశ్రేణి నాయకలు, కార్యకర్తలు వాస్తవ పరిస్థితుల గురించి ముఖ్య నేతలకు వివరిస్తుంటే ఇప్పుడు కాదు తరువాత చూద్దాంలే అని దాటవేత «ధోరణే కొంప ముంచిందని పలువురు చెప్పారు. ఇతర నాయకులు మాట్లాడుతూ పార్టీ అనుబంధ సంఘాలతోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సంఘం నాయకుల తీరు కారణంగా ఇతర ఉపాధ్యాయులు పార్టీకి పూర్తిగా దూరం అయ్యారన్నారు. నాయకులు మధ్య సఖ్యత లేకపోవటంతో కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. దీంతో పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు భజన కోటరీలను ఏర్పాటు చేసుకొని సామన్య కార్యకర్తలను దగ్గరకు కూడా రానీయలేదన్నారు. నియోజకవర్గాల్లో అధికార పార్టీ సామాజిక వర్గం మినహా ఇతరులను పూర్తిగా విస్మరించారని వెల్లడించారు. పరస్పర ఆరోపణలతో సమావేశం... ఈ సమావేశంలో పాల్గొన్న ద్వీతీయ శ్రేణి, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన పార్టీ అభ్యర్థుల పరస్పర ఆరోపణలతో పూర్తిగా సమావేశం కొనసాగింది. ఆరోపణలు శ్రుతిమించటంతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కలుగచేసుకొని ఇది సమయం కాదని.. ఇక సమష్టిగా పనిచేద్దామని నాయకులను వారించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేబినేట్లో ఆమోదించిన రుణమాఫీని అమలు చేసేందుకు కోర్టులను ఆశ్రయించాలని, జిల్లాలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాలు చేయ్యాలని, టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారటాన్ని ఖండిస్తున్నామని తీర్మానాలు చేశారు. కోడెల కుటుంబీకులపై నమోదవుతున్న కేసులను ఖండిస్తూ జిల్లా నాయకులు ఎవరూ మాట్లాడలేదు. సమావేశానికి మాజీ ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ అన్నం సతీష్, నియోజకవర్గ ఇన్చార్జులు నసీర్ అహ్మద్, గంజి చిరంజీవి తదితరులు హాజరుకాలేదు. -
మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు
పార్టీలో కొంతమంది నేతలు నోరు జారుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అమరావతిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా, వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో నాయకులు విఫలం అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల తీరు బాగోలేదనే భావన కూడా వ్యక్తం అవుతోందని, తాగునీటి విషయంలో కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఈ అసంతృప్తి ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలని నాయకులకు ఆయన సూచించినట్లు సమాచారం.