breaking news
Swabhiman Rally
-
స్వాభిమాన్ ర్యాలీ అట్టర్ ప్లాప్: పాశ్వాన్
పాట్నా: ఆర్డేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పాట్నాలో నిర్వహించిన తొలి ర్యాలీ 'స్వాభిమాన్' విఫలం అయిందని కేంద్ర మంత్రి ఎల్ జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. కచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలను ఖంగు తినిపించి సీట్లన్నింటిని ఎన్డీయే హస్తగతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలు కలసి గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీకి పెద్దగా జనం హాజరుకాలేదని, ఆ వచ్చినవారిని కూడా తీసుకొచ్చేందుకే పార్టీ కార్యకర్తలకు నిర్వహకులకు చాలా కష్టం కలిగించిందని ఎద్దేవా చేశారు. బీహార్‌లో ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీలో భారీ స్థాయిలో విజయం సాధించాయని, అందుకే ప్రతిపక్షం వారు మోదీకి తమ బలమెంతో చూపించాలనే ఉద్దేశంతో సభ నిర్వహించారు కానీ అది అట్టర్ ప్లాఫ్ అయిందని, వారికి తీరని అసంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇప్పటికే బీహార్ ప్రజలు నితీశ్ కుమార్ పాలనపై ఓ అంచనాకు వచ్చారని, తిరిగి ఆయన పాలన కింద ఉండాలని వారు అనుకోవడం లేదని చెప్పారు. మోదీ చేసిన డీఎన్ఏ విమర్శ ఒక్క వ్యక్తినే ఉద్దేశించి చేసింది తప్ప అందరిని ఉద్దేశించి చేసినది కాదని చెప్పారు. ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. -
బీజేపీని ఓడించి తీరుతాం
పాట్నా: వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను దెబ్బకొట్టి తీరుతామని, తప్పకుండా ఓడిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల కూటమి ఎన్డీయేను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమిలో ఎలాంటి విభేధాలు లేవని వారు స్పష్టం చేశారు. బుధవారం బీహార్ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక మీడియాతో మాట్లాడారు. ఈ నెల గాంధీ మైదాన్‌లో తమ కూటమి ఆధ్వర్యంలో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని నితీశ్ కుమార్ చెప్పారు. ఈ ర్యాలీలోనే మా డీఎన్ఏ లో తేడా ఉందని వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి తగిన బదులు ఇస్తామని చెప్పారు.