రైళ్ల జోరు షురూ!
‘సదా’కు రైల్వే శాఖపై కన్నడిగుల హర్షం
సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడకు కేంద్రంలో రైల్వే శాఖ లభించింది. దీంతో వరుసగా రెండోసారి కర్ణాటకకు చెందిన పార్లమెంటు సభ్యుడికే ‘ప్రత్యేక బడ్జెట్’ హోదా కలిగిన రైల్వే శాఖ లభించినట్లయింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన సదానందగౌడ, అనంతకుమార్, జీ.ఎం సిద్దేశ్వర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరికి అధికారికంగా మంత్రిత్వ శాఖలను మంగళవారం కేటాయించారు.
ఇందులో సదానందగౌడకు రైల్వే శాఖ, అనంతకుమార్‌కు ఎరువులు, రసాయన శాఖ, జీ.ఎం సిద్దేశ్వరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి పదవుల కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తూ నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ-2 ప్రభుత్వంలో చివరి కొద్దికాలం పాటు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే రైల్వే శాఖను నిర్వహించారు. సదాకు రైల్వే శాఖ లభించడంపై కన్నడనాట హర్షం వ్యక్తం అవుతోంది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో రైల్వే రంగం త్వరిత గతిన విస్తరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త రైల్వే లైన్లు, రైళ్లతో పాటు పలు పరిశ్రమలు కర్ణాటకలో ఏర్పాటయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.