breaking news
south zone tournment
-
హైదరాబాద్ ఘనవిజయం
బెంగళూరు: సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో హైదరాబాద్ శుభారంభం చేసింది. గురువారం కేరళతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (4/15) ధాటికి 33.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. ఈ సునాయాస లక్ష్యాన్ని హైదరాబాద్ 30 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి ఛేదించింది. తిరుమలశెట్టి సుమన్ (103 బంతుల్లో 61 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. స్పిన్ వలలో కేరళ కేఎస్‌సీఏ ఆలూరు క్రికెట్ గ్రౌండ్లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. ఓజాతో పాటు పేసర్ అబ్సలం (2/18), మరో స్పిన్నర్ అమోల్ షిండే (2/14)లు ఏ దశలోనూ కేరళను కోలుకోనివ్వలేదు. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఓపెనర్లు సురేంద్రన్ (2), జగదీశ్ (11)లు ఇన్నింగ్స్‌ను ఆరంభించినా జట్టుకు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద సురేంద్రన్ను ఔట్ చేసిన అబ్సలం కేరళ పతనానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత కేరళ స్పిన్ వలలో చిక్కుకుంది. జగదీశ్‌ను ఎల్బీగా పంపిన ఓజా... ఆ తర్వాత మరో ముగ్గురిని పెవిలియన్ చేర్చాడు. ఫెర్నాండెజ్ (2), సచిన్ బేబి (0), మనుకృష్ణన్ (8)లను ఓజా ఔట్ చేయగా, ప్రశాంత్ (3)తో పాటు టాప్ స్కోరర్ రోహన్ ప్రేమ్ (47)ను షిండే పెవిలియన్ చేర్చాడు. ఏకంగా 8 మంది బ్యాట్స్‌మెన్ ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యారు. సుమన్ నిలకడ సునాయాస లక్ష్యం కావడంతో హైదరాబాద్ ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడింది. ఓపెనర్ తిరుమల శెట్టి సుమన్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక మనోహరన్ బౌలింగ్‌లో అక్షత్ రెడ్డి (16) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన రవితేజ (34 బంతుల్లో 28 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో సుమన్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. సంక్షిప్త స్కోర్లు కేరళ ఇన్నింగ్స్: 33.5 ఓవర్లలో 107 ఆలౌట్ (రోహన్ ప్రేమ్ 47; ఓజా 4/15, అబ్సలం 2/18, షిండే 2/21) హైదరాబాద్ ఇన్నింగ్స్: 30 ఓవర్లలో 108/1 (సుమన్ 61 నాటౌట్, రవితేజ 28 నాటౌట్; మనోహరన్ 1/24) కర్ణాటక చేతిలో ఆంధ్ర చిత్తు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య కర్ణాటక జట్టు చేతిలో ఆంధ్ర జట్టు చిత్తుగా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 30.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. శ్రీకర్ భరత్ (25), స్వరూప్ కుమార్ (26) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. మొదటి 13 ఓవర్లకే ఆంధ్ర సగం వికెట్లను కోల్పోవడం గమనార్హం. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్, మనీశ్ పాండే చెరో 3 వికెట్లు తీయగా, మిథున్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత కర్ణాటక 23.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప (69 బంతుల్లో 54, 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో రాణించాడు. రాహుల్ 21 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో హరీశ్, సుధాకర్ చెరో 2 వికెట్లు తీశారు. -
హైదరాబాద్ జట్టు ఇదే...
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్లో పాల్గొనే అండర్-14 క్రికెట్ జట్టు వివరాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. జట్టు కెప్టెన్‌గా సమిత్ రెడ్డి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ వచ్చే నెల 6 నుంచి గోవాలో జరగనుంది. జట్టు కోచ్‌గా చేతన్ ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జింఖానా మైదానంలో హాజరు కావాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు: సూర్య తేజ, ప్రత్యూష్, వరుణ్ గౌడ్, రేవంత్, నిహాంత్ రెడ్డి, ప్రగ్యున్ దూబే, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, అజయ్‌దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, అలంక్రిత్ అగర్వాల్, అంకిత్ రెడ్డి, కమల్ కుమార్, రిషబ్, సాయిపూర్ణా రావు, మన్నాస్.