breaking news
south africa athlete
-
రాజీకి దక్షిణాఫ్రికా అథ్లెట్ పిస్టోరియస్ ప్రయత్నం
జొహన్నెస్‌బర్గ్: ప్రియురాలిని హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ రాజీ మార్గంలో పడ్డాడు. మోడల్ రీవా స్టీన్‌కాంప్‌ను తన సొంత ఫ్లాట్‌లో కాల్చి చంపిన కేసులో ఈ అథ్లెట్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. సోమవారం ఇతడిపై పోలీసులు హత్యా నేరం మోపారు. వచ్చే ఏడాది మార్చి 3న విచారణ ప్రారంభం కానుంది. అయితే అంతలోపే రీవా తల్లిదండ్రులతో కోర్టు బయట రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన లాయర్ ద్వారా ఇప్పటికే వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాడు. స్టీన్కాంప్ కుటుంబ లాయర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే వివరాలు వెల్లడించలేదు. మరోవైపు స్టీన్కాంప్, ఆమె సోదరుడి ఆదాయం మీదే తల్లిదండ్రులు జీవితం కొనసాగిస్తుండగా, ఇప్పుడు తమ కూతురు చనిపోవడంతో నష్టపరిహారం కింద 3 లక్షల డాలర్లకు సివిల్ వ్యాజ్యం వేసే ఆలోచనలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. -
పిస్టోరియస్పై హత్యా నేరం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రియురాలిని హత్య చేయడమే కాకుండా, చట్ట విరుద్ధంగా ఆయుధాలు కలిగినట్టు పోలీసులు అభియోగం మోపారు. గత ఫిబ్రవరి 14న ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను తుపాకితో కాల్చినట్టు ఈ 26 ఏళ్ల బ్లేడ్ రన్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంట్లోకి ఆగంతకులు వచ్చినట్టు భావించి తుపాకీ పేల్చగా అది రీవాకు తగిలినట్టు ఆస్కార్ వాదిస్తున్నాడు. అయితే ఈ కేసు విషయంలో గత ఆరు నెలలుగా డిటె క్టివ్స్, ఫోరెన్సిక్ నిపుణులు, బాలిస్టిక్ నిపుణులు, సైకాలజిస్టులు, సాంకేతిక నిపుణులు పనిచేశారని... పిస్టోరియస్ దోషిగా తేలుతాడని తాము నమ్ముతున్నట్టు దక్షిణాఫ్రికా జాతీయ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పిస్టోరియస్ విచారణ ప్రారంభానికి ముందు చేతులు ముఖానికి కప్పుకుని విలపిస్తూ కనిపించాడు. సోమవారం రీవా 30వ జన్మదినం కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో మరణ శిక్ష అమల్లో లేని కారణంగా ఒకవేళ పిస్టోరియస్ దోషిగా తేలితే గరిష్టంగా 25 ఏళ్లు శిక్ష పడుతుంది