breaking news
Sivateja suicide
-
నిమ్స్‌లో వైద్యుడి మృతిపై కమిటీ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందిన రెసిడెంట్ డాక్టర్ శివతేజారెడ్డి ఘటనపై బుధవారం విచారణ కమిటీ నిమ్స్‌లో పర్యటించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్యాశాఖ డెరైక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల తొలిసారిగా విచారణ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోని 5వ ఫ్లోర్లో విచారణ ప్రారంభించారు. శివతేజారెడ్డి మార్చి 25న తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో భాగంగా తొలిరోజు నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానందరెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ రఘు కిషోర్, ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, రెసిడెంట్ డాక్టర్లు శోభన్, సతీశ్, వంశీకృష్ణ తదితరులు కమిటీ ముందు హాజరయ్యారు. శివతేజారెడ్డి మంచితనం, విధి నిర్వహణలో ఆయన చూపే అంకిత భావం, సామాజిక సేవా కార్యక్రమాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. శివతేజారెడ్డి మృతికి కారకులైన బోధకుల పేర్లు కూడా కమి టీ దృష్టికి తీసుకెళ్లారు. పలు విభాగాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. రెసిడెంట్లు చెప్పిన అంశాలను కమిటీ సభ్యులు విని నోట్ చేసుకున్నారు. శనివారం మరోసారి ఆయా రెసిడెంట్లతో సమావేశమై తుది నివేదికను రూపొందించనున్నారు. -
వేధింపుల వల్లే ఆత్మహత్య : మీకు బిడ్డల్లేరా?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో యువ వైద్యుడు శివతేజరెడ్డి ఆత్మహత్య ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.రాజారెడ్డి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీఎస్వీ మంజుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. న్యూరోసర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ విచారణ చేపట్టనుంది. సోమవారం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న రెసిడెంట్లతో కమిటీ సమావేశమై.. రెసిడెంట్ వైద్యుల పట్ల ఫ్యాకల్టీ అనుసరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చించనుంది. ఇదిలా ఉంటే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, న్యూరోసర్జరీ విభాగం ఫ్యాకల్టీ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని శివతేజరెడ్డి తల్లి కవిత ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఆమె నిమ్స్ డైరెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, లేదంటే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. శివతేజ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్లతో కలసి శుక్రవారం ఆమె నిరసన తెలిపారు. చిన్న తప్పు దొర్లితే చాలు.. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో ఉన్నవాళ్లపై పనిభారం పెరుగుతోంది. ఇక ఆపరేషన్ థియేటర్లలో టేబుళ్లు, కుర్చీలు, గ్లౌజులు, మాస్కులే కాదు ఓటీలోకి వెళ్లేందుకు అవసరమైన డ్రెస్‌లు, చెప్పులు కూడా లేవు. పని ఒత్తిడి.. కనీస వసతులు లేకపోవడం.. కుటుంబ సభ్యులకు కనీస సమయం కేటాయించలేకపోతుండటంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చికిత్సల్లో చిన్న తప్పు దొర్లినా సీనియర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ వేధింపులతో మనస్తాపం చెందే శివతేజరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. న్యూరోసర్జరీ విభాగంలోనే కాక.. అన్ని విభాగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని పేర్కొంది. అయితే యువ వైద్యులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ వైద్యులు కృషి చేస్తున్నారని, రోగులు చనిపోయినప్పుడు సీనియర్ ఫ్యాకల్టీలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమయం లో రెసిడెంట్లే కాదు ఆ విభాగం మొత్తం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఫ్యాకల్టీ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనికి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా వద్ద ఆధారాలు ఉన్నాయి శివతేజను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని కమిటీకి అప్పగిస్తాం. మీడియా సహా ఇతరులెవరిపైనా మాకు నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం వాటిని బయట పెట్టడం లేదు. ఒక్క న్యూరాలజీ విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాల్లోనూ వేధింపులు ఎదురవుతున్నాయి. భయంతో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. – డాక్టర్ శివానందరెడ్డి, రెసిడెంట్ల సంఘం అధ్యక్షుడు వేధింపుల వల్లే ఆత్మహత్య..‘మీకు బిడ్డల్లేరా..? వైద్య విద్య కోసం వచ్చిన నా బిడ్డను సూటిపోటి మాటలతో వేధించి చంపేస్తారా? న్యూరాలజీ ఫ్యాకల్టీకిది తగునా.. చదువు కోసం వచ్చిన వారిని ఆదరించాల్సింది పోయి.. తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారా? ఫ్యాకల్టీతో పాటు ఎంఆర్ఐ టెక్నీషియన్లు కూడా నా బిడ్డను హేళన చేశారు. నాలాగా మరొకరికి పుత్రశోకం కలగకూడదనే న్యాయం పోరాటం చేస్తున్నాను. – శివతేజరెడ్డి తల్లి కవిత -
విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
బాంబే ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్న హైదరాబాద్ వాసి శివతేజ శాస్త్రవేత్త కావాలనుకుని అంతలోనే అనంత వాయువుల్లోకి పాలిథిన్ కవరు తలకు చుట్టుకుని, టేప్ అతికించుకుని బలవన్మరణం! చదివేది ముంబైలో.. నివాసం హైదరాబాద్‌లో.. కానీ, విశాఖలో ఆత్మహత్య చేసుకోవడంపై సందేహం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై: అతను చదువుల్లో టాప్.. ఎందరో కలలుగనే ముంబై ఐఐటీలో సులువుగా సీటు తెచ్చుకున్నాడు.. బాగా చదివి సైంటిస్ట్‌గా కావాలనుకున్నాడు.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగాడు.. తన ఆశయాలకు కుటుంబం నుంచి కావలసినంత తోడ్పాటూ ఉంది.. ఉన్నట్లుండి ఏమైందోగానీ, బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.. హైదరాబాద్‌కు చెందిన మొలకల శివతేజ (26) అనే ఐఐటీ విద్యార్థి వ్యథ ఇది.. అయితే, ఏ సమస్యలూ లేని శివతేజ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. శివతేజ చదువుకునేది ముంబైలో.. స్వస్థలం హైదరాబాద్.. కానీ, విశాఖపట్నంలోని ఒక లాడ్జిలో ఆయన మృతి చెందడంపై సందేహాలు వస్తున్నాయి. కడప జిల్లా తొండూరు మండలం కొరుగుంట్లపల్లికి చెందిన మొలకల రాజశేఖర్‌రెడ్డి, ఉషారాణి దంపతులు కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వలస వచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి కాప్రా ప్రాంతంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శివతేజ. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉన్న శివతేజ.. పదోతరగతి తరువాత రామయ్య ఇన్స్టిట్యూట్లో ఇంటర్‌తో పాటు ఐఐటీ శిక్షణ పొందాడు. ఐఐటీ ఎంట్రెన్స్‌లో 120వ ర్యాంక్ సాధించి, ముంబై ఐఐటీలో చేరాడు. అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేసిన శివతేజ ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాడు. చదువులోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటాడు. కానీ, అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామని... సంక్రాంతి సందర్భంగా శివతేజకు శుభాకాంక్షలు చెప్పేందుకు 13వ తేదీన తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ, రెండు రోజుల పాటు ప్రయత్నించినా.. ఫోన్ కలవలేదు. ముంబైలోని హాస్టల్‌కు ఫోన్‌చేస్తే.. అక్కడ లేడని సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ముంబై ఐఐటీకి వెళ్లి.. హాస్టల్లో, స్నేహితులను అందరినీ అడిగారు. ఆచూకీ తెలియకపోవడంతో.. ఈ నెల 16న ముంబైలో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదంతా జరుగుతుండగానే శనివారం ఉదయం విశాఖ పోలీసుల నుంచి వారికి తేజ మరణవార్త అందింది. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో లభ్యమైన పాన్ కార్డు, ఐఐటీ బాంబే గుర్తింపు కార్డు, పర్సు సహాయంతో.. పోలీసులు మృతుడిని గుర్తించి సమాచారం ఇచ్చారు. ఏం జరిగింది? శివతేజ ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో అశ్విని లాడ్జిలోని ఒక గదిలో దిగాడు. మరుసటి రోజు 17న మధ్యాహ్నం రిసెప్షన్లో వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, అదే రోజు రాత్రి లాడ్జి సిబ్బంది భోజనం కోసం తలుపుకొట్టినా, తెరవలేదు. దాంతో నిద్రపోయి ఉంటాడని భావించి సిబ్బంది పట్టించుకోలేదు. 18వ తేదీ ఉదయం కూడా ఎంతసేపు తలుపుకొట్టినా.. తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా... బాత్రూమ్లో శివతేజ మృతదేహం కనిపించింది. మృతదేహం తలపై నుంచి మెడవరకు పాలిథిన్ కవరు చుట్టి, గట్టిగా టేపుతో అతికించి ఉంది. చేతి వేళ్లకూ టేపు అతికించి ఉంది. ఘటనా స్థలంలో రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. అనుమానాస్పద మృతిగా... శివతేజ ముంబైలో చదువుతున్నా.. అక్కడ పెద్దగా స్నేహితులు లేరని పోలీసులు చెబుతున్నారు. చదువులోనూ చురుకు.. ఆర్థిక సమస్యలు కూడా లేవని అంటున్నారు. ఎలాంటి దుర్వ్యసనాలూ లేవని తేల్చారు. తేజ విశాఖకు వచ్చే ముందు బ్యాంకులోంచి కేవలం రూ. ఏడు వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకుని వచ్చాడు. అయితే, ఒకవేళ ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. శివతేజ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, మెయిల్స్‌తో పాటు ఫేస్బుక్ అకౌంట్‌నూ పోలీసులు పరిశీలించారు. కానీ, అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని తెలుస్తోంది. కానీ, ఘటనా స్థలంలో మాత్రం రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శత్రువులెవరూ లేరు: శివతేజ తండ్రి రాజశేఖర్ ‘‘తేజ అసలు విశాఖ ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు. నా కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం, వివాదాలు లేవు. చక్కగా చదువుకుంటాడు. ఎప్పుడూ మాతో మాట్లాడేవాడు ఫోన్ ఎందుకు ఎత్తలేదో తెలియక ముంబై వెళ్లాం. అక్కడ లేడు. కొద్దిరోజుల కింద తన పీహెచ్డీ రిపోర్ట్ చాలా బాగుందని ప్రొఫెసర్ ప్రశంసించారని కూడా చెప్పాడు. కానీ, ఇలా జరగడమేమిటో అర్థం కావడంలేదు.’’ కారణాలేమిటో బయటకు తేవాలి: రామయ్య ‘‘బాగా చదువుకొనే పిల్లలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తోంది. శివతేజ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చిందో తెలియాలి. ఇందుకోసం ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాఫ్తు చేపట్టాలి. ఒక్క శివతేజ అంశమే కాదు.. ఐఐటీల్లో చదివే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవాలి. ఐఐటీల్లో చదివేవారు ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.’’ ఇంటర్నెట్ వీడియోలు చూసి.. చదువులో ఎంతో చురుకుగా ఉండే శివతేజ ఇంటర్నెట్లో ఆత్మహత్యల వీడియోలు చూసి, ఆ తరహాలో బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ విదేశాల్లో మాత్రమే అలాంటి ఆత్మహత్యలు జరిగాయి. శివతేజ తలపై నుంచి మెడవరకు చుట్టూ గట్టి పాలిథిన్ కవర్‌ను నాలుగైదు చుట్లు గట్టిగా బిగించుకున్నాడు. గాలి చొరబడకుండా దాన్ని టేపుతో అతికించుకున్నాడు. తర్వాత చేతివేళ్లన్నింటిని కలిపి టేపు చుట్టుకున్నాడు. పాలిథిన్ కవరును గట్టిగా బిగించుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మృతిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.