siddipeta rural
-
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
సిద్దిపేట రూరల్: మండలంలోని రావురూకుల గ్రామానికి చెందిన నీరడి సత్తవ్వ ఆనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి హరీశ్‌రావు రూ. 5 వేలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం గ్రామ నాయకులు అల్లం కిషన్ చేతుల మీదుగా మృతురాలి భర్త ఎల్లయ్యకు అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్తవ్వకు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి, ఆర్థిక సహాయం చేశారు. దీంతో మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీధర్‌రెడ్డి, రాజయ్య, నీరడి రవీందర్, పోచయ్య, దుర్గయ్య, గ్రామ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సిద్దిపేట రూరల్: పదమూడేళ్ల బాలిక వివాహాన్ని అడ్డుకున్న ఘటన మండలంలోని లక్ష్మిదేవిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు... కొమర్రాజు ఎల్లయ్య-తార దంపతులు సుమారు ఐదేళ్లుగా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె (13) అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. హైదారాబాద్‌కు చెందిన తమ మేనవాళ్ల అబ్బాయి ఇచ్చి వివాహం జరిపించేందుకు నిశ్చంచారు. విషయం శనివారం గ్రామ వీఆర్వోకు సమాచారం రావడంతో తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహశీల్దార్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. పెళ్లి చేయని అంగీకార పత్రాన్ని రాయించుకున్నారు. అయినప్పటికి తల్లిదండ్రులు ఆదివారం గ్రామ దేవతల వద్ద పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో ఏసీడీపీఓ అరుణ, ఏఎస్ఐ బుచ్చయ్య, ఆర్ఐ సాజిద్, వీఆర్వో వెంకటేశ్‌లతో పాటు గ్రామ సర్పంచ్‌లు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆ బాలికను ఐసీడీఎస్ అధికారులు సిద్దిపేట బాలసదనానికి తరలించారు. ఈ సందర్భంగా సీడీపీఓ స్వప్న మాట్లాడుతూ కౌనెలింగ్ ఇచ్చినా వినకుండా తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేశారని, సోమవారం బాలికకు కూడా కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు.