breaking news
Set-top boxes
-
ఎయిర్టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కొత్త చందాదారులకోసం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం తాజాగా హెచ్డి, ఎస్డి సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించింది. డీటీహెచ్ ఆపరేటర్లలో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొత్త వినియోగదారులను ఆకర్షించనుంది. గత త్రైమాసికంలో నాలుగు లక్షలమంది ఖాతాదారులను తన ఖాతాలో చేర్చుకున్న భారతి ఎయిర్టెల్ ఇపుడు సెట్-టాప్ బాక్సల ధరలను రూ. 500 వరకు తగ్గించింది. ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఇప్పుడు రూ .1300 వద్ద హెచ్డి సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చు, ఇప్పటివరకు దీని ధర రూ .1800గా ఉంది. ఈ తగ్గింపుతో హెచ్డి బాక్స్ రూ.1,300 ధరతో అందిస్తుండగా, ఎస్డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1100ల ధర వద్ద అందిస్తోంది. కాగా డీటీహెచ్ ఆపరేటర్లలో మిగిలిన వారి ధరలతో పోల్చితే టాటా స్కై హెచ్డి సెట్-టాప్ బాక్స్ధర రూ .1499, ఎస్డి సెట్-టాప్ బాక్స్ ధర రూ .1399గా ఉంది. -
సెట్‌టాప్ బాక్సులకు గడువు పెంపు
రెండు నెలలు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబుల్ టీవీ డిజిటల్ ప్రసారాల నిమిత్తం ఏర్పాటు చేసుకోవాల్సిన సెట్‌టాప్ బాక్సుల గడువును హైకోర్టు పొడిగించింది. ఈ నెల 31తో ముగుస్తున్న గడువును రెండు నెలల పాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం ప్రకారం కేబుల్ టీవీ ప్రసారాల డిజిటలైజేషన్ మూడో దశ అమలులో భాగంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో డిసెంబర్ 31 నాటికి డిజిటల్ అడ్రసబుల్ సిస్టమ్ (డాక్)ను ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు గాను వినియోగదారులందరూ సెట్‌టాప్ బాక్సులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ఎంఎస్ఓల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.సుభాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సెట్‌టాప్ బాక్సుల కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల 31 నాటికి డాక్‌ను అమలు చేయడం సాధ్యం కాదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.రామచంద్రరాజు వాదనలు వినిపిస్తూ, సరిపడా సెట్‌టాప్ బాక్సులను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, కానీ.. విఫలమైందని తెలిపారు. ప్రస్తుతం 15 శాతం మంది మాత్రమే సెట్‌టాప్ బాక్సులను పెట్టుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే బాక్సులు అందుబాటులో ఉంచకుండా, గడువు సమీపిస్తున్నా దానిని పొడిగించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... గతంలో ఇదే హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులిచ్చిందని, మళ్లీ ఎలా జోక్యం చేసుకోమంటారు... అని ప్రశ్నించారు. అప్పుడు హైకోర్టు రెండో దశ విషయంలో ఉత్తర్వులిచ్చిందని, ఇది మూడో దశపై పిటిషన్ అని రామచంద్రరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గానీ, ఆయన కార్యాలయ న్యాయవాదులు గానీ లేకపోవడంతో, గడువును రెండు నెలలు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఓలు సైతం సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుపై హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ ఎస్‌ఎస్‌ఓలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.