breaking news
Sanjay Kaul
-
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్‌ను ఎన్ఏబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
యాపిల్ ఇండియాకు కొత్త అధినేత వస్తున్నాడు
న్యూఢిల్లీ : కుపెర్టినో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇండియాకు కొత్త అధినేత వచ్చేస్తున్నాడట. సంజయ్ కౌల్ ను యాపిల్ ఇండియాకు కొత్త మేనేజర్ గా నియమించనున్నట్టు సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కెనడా పౌరుడు అయిన కౌల్ కు 2011 నవంబర్ నుంచి యాపిల్ తో సంబంధం ఉంది. యాపిల్ ఐఫోన్ల బిజినెస్ ను అతనే చూసుకునేవాడు. యాపిల్ ఇండియాకు అధినేతగా ఉన్న మనీష్ ధిర్ జనవరిలో కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగడంతో, యాపిల్ ఈ బాధ్యతలను సంజయ్ కౌల్ కు అప్పజెప్పుతున్నట్టు తెలుస్తోంది. కౌల్ యాపిల్ కంపెనీలో చేరకముందు, బ్లాక్ బెర్రీకి కెపాసిటీ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎయిర్ టెల్ బ్లాక్ బెర్రీ బిజినెస్ ను మూడు అంకెల వృద్ది శాతానికి తీసుకురావడంలో కౌల్ కీలక పాత్ర పోషించాడు. బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ(టెక్) ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన కౌల్,1988లో గుస్తవ్ సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ పై ఎమ్ బీఏ పట్టా అందుకున్నాడు. అనంతరం 2008లో ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రీమియం మార్కెట్లో ఆధిక్యంలో ఉన్న శామ్ సంగ్ ను అధిగమించడానికి యాపిల్ ఎక్కువగా కృషిచేస్తోంది. మార్కెట్లో అన్ని ఉత్పత్తులకూ భారత మార్కెట్ ఎంతో కీలకమని, భారత్ లో బిజినెస్ పెంచుకోవడానికి యాపిల్ ఎక్కువ దృష్టిపెడుతుందని ఇటీవలే సీఎన్ బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. భారత్ లో తమ బ్రాండ్ స్టోర్లను తెరుస్తామని పేర్కొన్నారు.