breaking news
RTC MD Sambasiva Rao
-
ఏపీలో హోరెత్తిన ఆందోళన!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగో రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తింది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు అన్ని డిపోల ఆవరణల్లోనూ ‘వంటా-వార్పూ’ చేపట్టారు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయవాడలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో కార్మికులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి సహా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సిద్ధా, ఆర్టీసీ ఎండీపై బాబు అసహనం.. కార్మికుల సమ్మెను సరిగా డీల్ చేయలేకపోయారని, కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా నిరోధించలేకపోయారని సీఎం చంద్రబాబు.. రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమ్మెపై శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు సమీక్షించారు. సబ్ కమిటీ ఎంతిమ్మంటే అంత ఫిట్మెంట్ ఇస్తామని చంద్రబాబు అన్నట్టు తెలిసింది. కాగా ఫిట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉపసంఘంలోని మంత్రులు యనమల రామకృష్ణుడు, శిద్దా రాఘవరావు, కె.అచ్చెన్నాయుడులు చర్చిస్తారు. కలసి వస్తున్న కామ్రేడ్లు :ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ, సీసీఎం సహా పది వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. అవి శనివారం సమావేశమై సోమవారం నుంచి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. సమ్మెను ఆపబోం.. ఆర్టీసీ సమ్మె సరికాదని, కార్మికులు విధుల్లో చేరాలని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో... తాము సమ్మెను ఆపబోమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కోర్టు తీర్పు పూర్తి పాఠం అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, స్పందిస్తామని వారు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. కోర్టు తదుపరి చేసే వ్యాఖ్యలను బట్టి ఆలోచిద్దామనే ధోరణిలో వారు ఉన్నట్లు సమాచారం. ఆదివారం మంత్రులు చర్చలకు పిలిచినా 43 శాతం ఫిట్మెంట్ విషయంలో గట్టిగానే వాదించాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది.. కార్మిక సంఘాలతో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటివరకు కార్మిక సంఘాల నేతలంతా రాష్ట్రాలకు అతీతంగా ముందుకు సాగగా.. శుక్రవారం సాయంత్రం యాజమాన్యంతో చర్చల సందర్భంగా ఉన్నట్టుండి తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అసలు అంశం పక్కదోవపట్టి చర్చలు విఫలమవటానికి కారణమైంది. సమావేశం నుంచి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయం తుస్సే.. మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమూలకూ సరిపోలేదు. శుక్రవారం కూడా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం 1,550 బస్సులు రోడ్డెక్కగా శుక్రవారం ఆ సంఖ్య 2140కి పెరిగింది. ముఖ్యంగా అన్ని అద్దె బస్సులను పోలీసు రక్షణ మధ్య నడిపించారు. కార్మికులకు, పోలీసులకు.. కార్మికులకు, తాత్కాలిక సిబ్బందికి మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 18 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరంగల్‌లో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో 15 మంది మహిళా కార్మికులు సహా పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో డ్రైవర్ ఎస్కె గులాం సంధాని పాషా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక ప్రైవేటు వాహనాలు చార్జీలను మరింత పెంచి వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల జేబు గుల్లవుతోంది. ఎండీ వర్సెస్ టీఎంయూ ఆర్టీసీ ఎండీగా ఉన్న సాంబశివరావు తెలంగాణ కార్మిక సంఘాలను వ్యూహాత్మకంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేత అశ్వత్థామరెడ్డి... శుక్రవారం నాటి చర్చ సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీంతో అసలు తెలంగాణకు, తనకు సంబంధమే లేదని... ఆ రాష్ట్ర విషయాలను తనను అడగొద్దని ఎండీ ఘాటుగా పేర్కొన్నారు. అలాం టప్పుడు చర్చలకు తెలంగాణ నేతలను ఎందుకు ఆహ్వానించారని అశ్వత్థామరెడ్డి నిలదీయగా... ఇది ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు సూచన మేరకు ఏర్పాటు చేసిన సమావేశమని, అవసరం లేదనుకుంటే తెలంగాణ నేతలు వెళ్లిపోవచ్చని సాంబశివరావు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రమే కార్మికులకు 27 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదన పెట్టిం దని, తెలంగాణ ప్రభుత్వం ఒక శాతం కూడా ఫిట్మెంట్ ప్రతిపాదన పెట్టలేదన్నారు. ఈ తరుణంలో ఆయనకు, అశ్వత్థామరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత సాంబశివరావు సమావేశం నుంచి నిష్ర్కమించారు. దాంతో అర్ధాంతరంగా భేటీ ముగిసింది. ఎండీ మాటల్లో తప్పులేదు.. తెలంగాణ అంశాలకు తనకు సంబంధం లేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 27 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదించని విషయం కూడా నిజమేనని చెప్పారు. ప్రత్యేకంగా మంత్రుల సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అది తేల్చకుండా ఫిట్మెంట్ ప్రతిపాదన ఎలా సాధ్యమన్నారు. కాగా.. ఎండీ సాంబశివరావు కావాలనే తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. కార్మిక నేతల రిలీఫ్‌లకు కత్తెర..: విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా కార్మిక సంఘం నేతలకు ఉన్న రిలీఫ్‌లను ఆర్టీసీ యాజమాన్యం తొలగించింది. ఎన్ఎంయూ, ఈయూ, టీఎంయూలకు చెందిన 43 మంది నేతలకు 365 రోజుల పాటు విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్న వెసులుబాటును రద్దు చేసింది. ఇక సంఘం సభ్యుల నుంచి చందా వసూలు చేసి కార్మిక నేతలకు చెల్లించే ఏర్పాటును కూడా రద్దు చేసింది. రాజధానిలో రోడ్డెక్కిన 531 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్నా.. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం బస్సులను నడిపించడంలో అధికారులు కొంత వరకు సఫలమయ్యారు. ప్రైవేటు, కాంట్రాక్టు సిబ్బంది సహాయంతో శుక్రవారం హైదరాబాద్ పరిధిలో 531 బస్సులను తిప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ప్రయాణికులకు కొద్దిగా ఊరట లభించింది. ఇక నగరంలోని 28 డిపోల్లో కార్మికులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. హయత్ నగర్ డిపో వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ మధ్య రైల్వే రోజువారీగా తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో 8 రైళ్లను అదనంగా నడిపింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు ఆర్టీసీ సమ్మె, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాకినాడ-విజయవాడ (07051) ప్రత్యేక రైలు 9వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ (07046/07047) ప్రత్యేక రైలు 10న సాయంత్రం 7కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.20కి కాచిగూడకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో 11న ఉదయం 11.30కు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.40కి తిరుపతి చేరుకుంటుంది. కాచిగూడ-విజయవాడ ఏసీ డబుల్‌డెక్కర్ (02118/02117) రైలు 11న ఉదయం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8.10కి కాచిగూడ చేరుకుంటుంది. -
ఆర్టీసీ విభజనకు కసరత్తు
⇒ రెండు రాష్ట్రాల సీఎంలతో కొత్త ఎండీ సాంబశివరావు విడివిడిగా భేటీ ⇒ సంస్థను విభజిస్తేనే అభివృద్ధికి అవకాశమని వెల్లడి ⇒ వెంటనే ప్రణాళిక రూపొందించాలని ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశం ⇒ మూడునాలుగు రోజుల్లో నివేదిక సిద్ధం చేస్తానన్న ఆర్టీసీ ఎండీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని వేగంగా విభజించేందుకు ఆ సంస్థ కొత్త ఎండీ సాంబశివరావు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించే క్రమంలో మంగళవారం ఆయన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని, లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఇరువురి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో సంస్థ విభజన పూర్తి కావాల్సి ఉందని, రెండు కార్పొరేషన్లు ఏర్పాటైతేనే ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి విడివిడిగా ప్రణాళికలు రూపొందించేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో చొరవ చూపించి త్వరగా విభజన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సాంబశివరావును ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదేశించారు. తొలుత చంద్రబాబుతో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ అనేక అంశాలపై చర్చించారు. ఆంధ్రాలోని పుష్కల వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని గాడినపెట్టే దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అయితే విభజన తంతు పూర్తికాకపోవటం వల్ల అధికారులు, సిబ్బంది గందరగోళంలో ఉన్నారని, అది పూర్తికాగానే సంస్థను లాభాల బాట పట్టించే అంశంపై కసరత్తు చేస్తానని సాంబశివరావు హామీ ఇచ్చారు. విభజన విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆర్టీసీ ఎండీ కలిశారు. సంస్థ బాగుపడాలన్నదే తన ఉద్దేశమని, ఇందుకు విభజనతో మార్గం సుగమమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక జాప్యం తగదని సూచించారు. దీనికి ఎండీ స్పందిస్తూ.. వెంటనే విభజనపై దృష్టిసారించి మూడు నాలుగు రోజుల్లో ప్రణాళిక రూపొందించనున్నట్టు కేసీఆర్‌కు స్పష్టం చేశారు. ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు సమావేశమైన విషయం తెలిసిందే. ఆస్తులు-అప్పుల పంపకంతో సంబంధం లేకుండా తొలుత రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ఉమ్మడిగా ఓ నివేదికను అందజేయాల్సిందిగా కోరింది. ఇప్పుడు దాన్ని రూపొందిస్తున్నామని సాంబశివరావు ‘సాక్షి’తో చెప్పారు.