బాన్సువాడలో పట్టపగలే చోరీ
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లడంతో దుండగులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడు, వ్యాపారస్తుడు బెజుగం రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాఘవేందర్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తమ బంధువుల వివాహానికి వెళ్లారు. పగలే కావడంతో కేవలం ప్రధాన ద్వారానికి మాత్రమే తాళం వేశారు. వీరు బయటకు వెళ్లినట్లు గమనించిన దొంగలు, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తులో ఉన్న రాఘవేందర్ ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టారు. లోపలి నుంచి గొళ్లెం వేసుకున్న దొంగలు, బెడ్రూంలో ఉన్న బీరువాను పగుల గొట్టి, అందులో ఉన్న రూ. 5 లక్షలను, 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెనుక భాగంలో ఉన్న తలుపును తెరిచి, ఎవరి కంట పడకుండా పారిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి ఇంటికి వచ్చిన రాఘవేందర్ భార్య, ఇంట్లో చోరీ జరగడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ ఇన్చార్జి సీఐ వెంకటరమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. అలాగే బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి వచ్చి పూర్తి వివరాలను సేకరించారు. క్లూస్ టీంను రప్పించి దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుడు రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. కాగా చోరీ తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఎక్కడ ఏం ఉంటుందో తెలిసిన వారే చోరీ చేశారని, అలాగే మధ్యాహ్నం ఇంట్లోని అందరూ వివాహానికి వెళ్లిన విషయం కూడా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.