breaking news
Royalty income
-
అనుమతి లేకుండా నా పాటలు పాడొద్దు
నా అనుమతి లేకుండా నా పాటలు పాడారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు జారీ చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇళయరాజా. ‘‘నేను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దని మీకు చెప్పడం లేదు. కానీ, పాడే ముందు నా అనుమతి తీసుకోండి.. తీసుకోకపోతే మాత్రం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. నేను ఐపీఆర్‌ఎస్(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్ వసూలు చేస్తోంది. ఇకపై అలా జరగకూడదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. మీరు పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు? ఉచితంగా పాడటం లేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం కరెక్టేనా? నాకూ వాటా రావాల్సిన అవసరం లేదా? నేను అడుగుతోంది కొంచెం డబ్బు మాత్రమే. భవిష్యత్ తరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
పెద్దతరహా ఖనిజాలపై రాయల్టీ పెంపు!
తాండూరు: పెద్ద తరహా ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం రాయల్టీని పెంచింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ ఆదాయం పెరగనుంది. ఈ మేరకు పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీని పెంచుతూ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 1న 630 జీవోను జారీ చేసింది. దీంతో కొత్త రాయల్టీ విధానం అమల్లోకి వచ్చింది. లైమ్‌స్టోన్, ల్యాటరైట్, క్వార్డ్జ్, షేల్, ఇనుము తదితర పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీ పెరిగింది. సిమెంట్ ఉత్పత్తుల తయారీకి వినియోగించే లైమ్‌స్టోన్ (సున్నపురాయి)పై టన్నుకు రూ.63 ఉన్న రాయల్టీ ఛార్జీలను రూ.80కు, ల్యాటరైట్ (ఎర్రమట్టి)పై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) విలువ ప్రకారం టన్నుకు రూ.46- రూ.51 (15 శాతం నుంచి 25శాతం) రాయల్టీని కేంద్రం ప్రభుత్వం పెంచింది. క్వార్డ్జ్(పలుగురాయి)పై రూ.20 నుంచి రూ.35కు, షేల్పై రూ.36 నుంచి రూ.60, ఇనుము టన్నుకు రూ.60 నుంచి రూ.80కు రాయల్టీని పెంచింది. తాండూరు ప్రాంతంలోని పెద్ద తరహా ఖనిజాలపై ఏడాదికి సుమారు రూ.25కోట్ల మేరకు రాయల్టీ రూపంలో ఆదాయం వస్తోంది. కొత్త రాయల్టీ విధానం ప్రకారం సర్కారుకు అదనంగా రూ.5 కోట్ల ఆదాయం సమకూరనుంది. చిన్నతరహా ఖనిజాలపై.. చిన్నతరహా ఖనిజాలపైనా రాయల్టీని పెంచాలనే దిశగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. నాపరాతి బండలు (లైమ్‌స్టోన్ స్లాబ్), సుద్ద (పుల్లర్స్ఎర్త్) తదితర చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ పెరగనుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక చదరపు అడుగు నాపరాతికి ప్రభుత్వానికి రూ.7 రాయల్టీ వస్తోంది. దీనిపై 10-20 శాతం రాయల్టీ పెంచాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఒక చదరపు అడుగు నాపరాతికి రూ.10 రాయల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక తెల్ల సుద్ద టన్నుకు రూ.110 -రూ.121, ఎర్ర సుద్ధ టన్నుకు రూ.44 నుంచి సుమారు రూ.50 వరకు రాయల్టీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చిన్నతరహా ఖనిజాల కొత్త రాయల్టీపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ ఛార్జీల పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. ఎన్నికల సందర్భంగా తాండూరు పర్యటనలో తాండూరు నాపరాతిపై రాయల్టీని తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో రాయల్టీ పెంచుతారా.. లేదా.. అనేది సందిగ్ధంగా మారింది. మరోవైపు తాండూరు సరిహద్దులోని కర్ణాటకలో సుమారు రూ.450 రాయల్టీ ఉంది. ఇదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేసి, కష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.