breaking news
Reliance Industries Group
-
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్‌లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్‌ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్‌లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్‌ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్‌లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్‌లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్‌తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్‌లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్‌కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్‌తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్‌ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్‌కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్‌కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్‌లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్‌లోనే ఆకాశ్.. జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈషా, అనంత్‌లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్‌ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్‌ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్‌కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్‌కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
జిల్ జిల్ జియో!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫేస్బుక్ బాటలో సిల్వర్ లేక్ పార్ట్నర్స్ సంస్థ.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.15 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం రూ. 5,655.75 కోట్లు వెచ్చిస్తోంది. ‘ తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లుగాను ఉంటుంది‘ అని జియో ప్లాట్‌ఫామ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల కోసం ఫేస్బుక్ చెల్లించిన రేటుతో పోలిస్తే సిల్వర్ లేక్ 12.5 శాతం అధిక ప్రీమియం చెల్లిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్ల కింద లెక్కించి 9.99 శాతం వాటాల కోసం ఫేస్బుక్ రూ. 43,574 కోట్లు చెల్లించింది. టెలికం కార్యకలాపాలు సహా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి జియో ప్లాట్‌ఫామ్స్ కింద రిలయన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘ ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో సిల్వర్ లేక్ ఎంతో విలువైన భాగస్వామిగా ఉంది. సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నా. దేశప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరేలా భారతీయ డిజిటల్ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నాను‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో విశిష్ట స్థానముంది. సాహసోపేతమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసే దిశగా పటిష్టమైన మేనేజ్మెంట్ సారథ్యంలో నడుస్తోంది‘ అని సిల్వర్ లేక్ కో–సీఈవో ఎగాన్ డర్బన్ పేర్కొన్నారు. 20 శాతం దాకా వాటాలను వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్ విక్రయిస్తోంది. ఇప్పటికే ఇందులో సగభాగం ఫేస్బుక్ కొనుగోలు చేసింది. మిగతా వాటాలను సిల్వర్ లేక్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నారు. సిల్వర్ లేక్ కథ ఇదీ.. భారీ టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంలో సిల్వర్ లేక్ పార్ట్నర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని నిర్వహణలోని ఆస్తులు, పెట్టుబడుల పరిమాణం 40 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్లో భాగమైన వెరిలీ.. వేమో విభాగాల్లో, డెల్ టెక్నాలజీస్, ట్విటర్ తదితర గ్లోబల్ దిగ్గజ సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తింది. భారత్‌లో సిల్వర్‌లేక్ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం. రుణభారం తగ్గించుకునే దిశగా అడుగులు 2021 నాటికి రుణరహిత సంస్థగా మారాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకుంది. మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. రుణ భారం తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్ నాటికి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించాలని రిలయన్స్ భావిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్, ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో వాటాల విక్రయంతో పాటు రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సమీకరించనుంది.