breaking news
Redsandle smuggler
-
శేషాచలంలో అలజడి
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. రంగంపేట సమీపంలోని భీమవరం ఘాట్ మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు తారసపడ్డారు. అడవిలోకి వాహనం వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలో తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సిబ్బందిని చుట్టుముట్టిన స్మగ్లర్లు మారణాయుధాలు, రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు ఉండొచ్చని సమాచారం. ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బడా స్మగ్లర్ దొరికాడు
కడప అర్బన్: ఎట్టకేలకు పోలీసులు బడా స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సుబ్రమణ్యం అలియాస్ సుబ్రంతోపాటు ఆయన ప్రధాన అనుచరులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కడపృరాయచోటి రహదారిలో చింతకొమ్మదిన్నె మండలం కాంపల్లె చెక్‌పోస్టు వద్ద ఓఎస్డీ సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.5 టన్నుల బరువున్న 125 ఎర్రచందనం దుంగలు, లారీ, కారు, రెండు సెల్ఫోన్లు, రూ. 3,40,515 నగదు, విదేశీ కరెన్సీలో 100 అమెరికన్ డాలర్ నోట్లు 19, యూఏఈ దిరహం నోటు ఒకటి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు పెరెడ్ గ్రౌండ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పోలీసులు ఇటీవల పలువురు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిని విచారణ చేయగా.. అంతర్జాతీయ స్మగ్లర్లు అయిన సింగపూర్‌కు చెందిన సుబ్రమణ్యం, దుబాయ్‌కి చెందిన షాహుల్ హమీద్‌తోపాటు చైనాకు చెందిన చెన్‌సులిన్, చెన్ లియాంగ్, హాంకాంగ్‌కు చెందిన జిమ్మి మైఖేల్, సింగపూర్‌కు చెందిన హనీఫా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్మగర్ల గురించి తెలిపారు. వారిని అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు బడా స్మగ్లర్‌ను పట్టుకుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆయన అరెస్ట్‌తో సింగపూర్, మలేషియా మార్గంలోని అక్రమ రవాణాకు చెక్ పడినట్లయింది. ఇదీ సుబ్రమణ్యం నేపథ్యం తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాకు చెందిన ఇతను పూర్వీకులతో మలేషియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా వరకు విద్యను అభ్యసించి సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలో ఇంజనీరుగా పని చేశాడు. బంధువులు తమిళనాడులో ఉండడంతో సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చి వెళ్లే క్రమంలో కరుడుకట్టిన ఎర్రచందనం స్మగ్లర్ శేఖర్‌మోరెతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం విక్రయాలపై అవగాహన ఉన్న సుబ్రమణ్యం చైనాలోని ప్రధాన స్మగ్లర్లతోపాటు హాంకాంగ్, సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. 2002 నుంచి ఇప్పటి వరకు రెండు వేల టన్నులకు పైగా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశాడు. దుబాయ్‌కి చెందిన స్మగ్లర్ షాహుల్ హమీద్ దుంగలను కంటైనర్ల ద్వారా హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌కు తరలిస్తే అక్కడ సుబ్రమణ్యం కొనుగోలుదారులను రప్పించి విక్రయించే వాడు. జిల్లాలో 17 కేసులు, చిత్తూరు జిల్లాలో ఒక కేసు నమోదైంది. ∙అరెస్ట్ అయిన వారిలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలూకా తాడూరు గ్రామానికి చెందిన కలివి వెంకటేశ్ ఉన్నాడు. ఇతను జిల్లాలో తొమ్మిది కేసుల్లో నిందితుడు. ∙మరో నిందితుడు చెన్నై నగరానికి చెందిన ఎస్ఎం సుందరం అలియాస్ కార్తికేయ ఇప్పటి వరకు 10 కంటైనర్లను దుబాయ్‌కి తరలించినట్లు విచారణలో తేలింది. జిల్లాలో తొమ్మిది కేసుల్లో నిందితుడు. ∙వీరితోపాటు జిల్లాలోని దువ్వూరు మండలానికి చెందిన గోరంట్ల నరసింహులు, బుక్కే శివనాయక్, సంగటిపల్లి కొండయ్య నల్లమల అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి.. వాటిని దుంగలుగా మార్చి దువ్వూరుకు చెందిన అవిలి పోలయ్య ద్వారా తమిళనాడు స్మగ్లర్లకు విక్రయించే వారు. పోలయ్య వెంకటేశన్, కార్తికేయకు పై ముగ్గురు స్మగ్లర్లను పరిచయం చేశాడు. గోరంట్ల నరసింహులు, శివనాయక్ జిల్లాలో ఏడు కేసులు, కొండయ్య ఐదు కేసుల్లో నిందితులు. వీరిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓఎస్డీ (ఆపరేషన్) బి.సత్య ఏసుబాబు, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, సీఐ ఎస్.పద్మనాభం, ఎస్ఐలు బి.హేమకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.