pranav dhanwade
-
‘థౌజండ్‌వాలా’ ఆట మానేశాడు!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల క్రితం...భారత క్రికెట్లో ప్రణవ్ ధనవాడే అనే 16 ఏళ్ల కుర్రాడి పేరు మారుమోగిపోయింది. స్కూల్ క్రికెట్లో ఏకంగా 1009 పరుగులు సాధించి అతను కొత్త రికార్డులతో సంచలనం సృష్టించాడు. అభినందనలు, సత్కారాలకు లెక్కే లేదు... సచిన్ టెండూల్కర్ స్వయంగా తన సంతకంతో బ్యాట్‌ను పంపించి ప్రత్యేకంగా అభినందించాడు. అతనికి అండగా మేమంతా అంటూ ఎవరెవరో వచ్చి ప్రణవ్ను ఆకాశానికెత్తేశారు. కానీ ఇదంతా ఓ వైపు... ఆ తర్వాత అదే ‘థౌజండ్’ స్కోరు ప్రణవ్‌కు పెనుభారంగా మారింది. అపరిమిత అంచనాలో లేక ఆటలో పదును తగ్గిందో కానీ ఆ వేయి పరుగుల ఇన్నింగ్స్ తర్వాత అతని బ్యాట్ మూగబోయింది. సాధారణ స్థాయి స్కోర్లు కూడా చేయలేక అతను చతికిలపడ్డాడు. ఎంత ప్రయత్నించినా నాటి ఇన్నింగ్స్‌లో పదో వంతు ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. దాని ఫలితం...ప్రణవ్ ఇప్పుడు ఆటనుంచే తప్పుకునేందుకు సిద్ధమైపోయాడు. మానసికంగా కుంగిపోయిన అతను క్రికెట్ ఆడటం తనవల్ల కాదంటూ బ్యాట్ విడిచిపెట్టాడు. బలమైన కుటుంబ ఆర్థిక నేపథ్యం లేకపోవడం వల్లనో, కష్టాల్లో వెన్నుదన్నుగా నిలిచేవారు లేకనో ప్రణవ్‌కు సరైన మార్గనిర్దేశనం చేసేవారే కరువయ్యారు. దాంతో అతను వరుస వైఫల్యాల తర్వాత క్రికెట్ ఆడటమే మానేశాడు! ఏడాదిన్నరగా క్రికెట్లో విఫలమవుతుండటంతో మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) నుంచి వచ్చే రూ. 10,000 ఉపకార వేతనాన్ని నిలిపివేయాల్సిందిగా స్వయంగా అతని తండ్రి ప్రశాంత్ ధనవాడే కోరాడు. తిరిగి ప్రణవ్ ఫామ్ అందుకొని క్రికెట్లో రాణించినప్పుడు అతన్ని ఆదుకోవాల్సిందిగా ఎంసీఏకు విన్నవించాడు. అసలే ఫామ్ కోల్పోయి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రణవ్ను ఎయిరిండియా, దాదర్ యూనియన్ క్లబ్‌లు తమ అకాడమీల్లో ప్రాక్టీస్ చేసేందుకు కూడా అనుమతించలేదు. బెంగళూరులో అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన మాటలు కూడా ప్రణవ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపలేకపోయాయి. ఈ అంశంపై ప్రణవ్ కోచ్ మోబిన్ షేక్ మీడియాను తప్పుబట్టారు. అతి ప్రచారం కూడా ప్రణవ్ ఏకాగ్రతను దెబ్బతీసిందన్నారు. చిన్న గ్రౌండ్లలో ఆడటంతోనే పరుగులు సాధించాడు అంటూ అప్పుడు వచ్చిన తప్పుడు కథనాలు ప్రణవ్ ఆటతీరును దెబ్బతీశాయని అతను వివరించాడు. అతడు తప్పకుండా తిరిగి బ్యాట్ అందుకుంటాడని, గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కోచ్‌తో పాటు కొందరు సన్నిహితులు అతనిలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి కృషి సఫలం కావాలని కోరుకుందాం! -
కొత్త హీరో వచ్చాడు.. 323 బంతుల్లో 1009
-
కొత్త హీరో వచ్చాడు.. 323 బంతుల్లో 1009
ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ రికార్డుల పుస్తకాలను తిరగరాస్తున్నాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్వాడే మరో సరికొత్త రికార్డు లిఖించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు. ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ క్రికెట్లో ఓ సంచలనం. మంగళవారం లంచ్ సమయానికి ప్రణవ్ 921 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంచ్ సమయానికి ప్రణవ్ టీమ్ 1337 పరుగులు సాధించింది. విరిగిన బ్యాట్‌తో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రణవ్.. మధ్యలో కొత్త బ్యాట్ తీసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం గాంధీ స్కూల్ జట్టు 1465 పరుగులు చేసింది. సోమవారం కేవలం 199 బంతుల్లో ధనవాడే 652 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ప్రణవ్ 116 సంవత్సరాల తర్వాత బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
199 బంతుల్లో 652 నాటౌట్!
స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. మైనర్ క్రికెట్లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.


