కొత్త హీరో వచ్చాడు.. 323 బంతుల్లో 1009
ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ రికార్డుల పుస్తకాలను తిరగరాస్తున్నాడు.
ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ రికార్డుల పుస్తకాలను తిరగరాస్తున్నాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్వాడే మరో సరికొత్త రికార్డు లిఖించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు. ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ క్రికెట్లో ఓ సంచలనం.
మంగళవారం లంచ్ సమయానికి ప్రణవ్ 921 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంచ్ సమయానికి ప్రణవ్ టీమ్ 1337 పరుగులు సాధించింది. విరిగిన బ్యాట్తో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రణవ్.. మధ్యలో కొత్త బ్యాట్ తీసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం గాంధీ స్కూల్ జట్టు 1465 పరుగులు చేసింది. సోమవారం కేవలం 199 బంతుల్లో ధనవాడే 652 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ప్రణవ్ 116 సంవత్సరాల తర్వాత బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.


