breaking news
Pranab Roy
-
అదానీ గ్రూప్ గూటిలో ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ తాజాగా 27.26 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి ఎగసింది. వెరసి ఎన్డీటీవీపై పూర్తి నియంత్రణను సాధించింది. గత వారం రాయ్ జంట తమకుగల 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీలో రాయ్‌లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా ఉంది. తాజా లావాదేవీ తదుపరి రాయ్‌ల వాటా(2.5 % చొప్పున) 5 శాతానికి పరిమితమైంది. షేరుకి రూ. 342.65 ధరలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. మైనారిటీ వాటాదారులకు చెల్లించిన(ఓపెన్ ఆఫర్) ధరతో పోలిస్తే ఇది 17 శాతం అధికంకాగా.. తద్వారా రాయ్ జంట రూ. 602 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ద్వారా వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. రాయ్‌ల రాజీనామాలు యాజమాన్య నియంత్రణ పూర్తిస్థాయిలో చేతులు మారిన నేపథ్యంలో వ్యవస్థాపకులు ప్రణవ్ రాయ్, రాధికా రాయ్‌సహా మరో నలుగురు డైరెక్టర్లు బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అంతేకాకుండా కనీస వాటా మాత్రమే మిగిలిన మాజీ ప్రమోటర్లు కంపెనీలో తమను పబ్లిక్ కేటగిరీ వాటాదారులుగా పరిగణించమంటూ బోర్డుని అభ్యర్థించారు. ఇందుకు బోర్డు అనుమతించగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, వాటాదారులు ఆమోదముద్ర వేయవలసి ఉన్నట్లు ఎన్డీటీవీ తెలియజేసింది. బోర్డు నుంచి తప్పుకున్న డైరెక్టర్లలో డారియస్ తారాపోర్వాలాతోపాటు, స్వతంత్ర డైరెక్టర్లు కౌశిక్ దత్తా, ఇంద్రాణి రాయ్, జాన్ మార్టిన్ ఓలోన్ ఉన్నారు. ఇప్పటివరకూ ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కోచైర్పర్శన్ పదవిలో ఉన్న విషయం విదితమే. మరోవైపు అమన్ కుమార్ సింగ్‌ను నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా, సునీల్ కుమార్‌ను స్వతంత్ర నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు 2.6% లాభపడి రూ. 348 వద్ద ముగిసింది. -
'ఆ విషయం ధోనికి తెలుసు'
చెన్నై:గత కొంతకాలంగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీపై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధోని కెప్టెన్సీ నుంచి తొలగించి విరాట్ కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పడమే సరైనది అంటూ పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధోని వారుసుడిగా ఇప్పటికే టెస్టు సారథి పగ్గాలు స్వీకరించిన కోహ్లి సక్సెస్ కావడంతో వారి వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే అది సరైన చర్య కాదని అంటున్నాడు మాజీ భారత సెలక్టర్ ప్రణబ్ రాయ్. 2004లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో ధోని ఎంపిక కావడానికి ప్రధాన కారణమైన ప్రణబ్ రాయ్.. ఇంకా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం రాలేదంటున్నాడు. 'కెప్టెన్సీ నుంచి ధోని ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. ప్రస్తుతం ధోనికి ప్రత్యామ్నాయం లేదు. అతను ఒక ఆటగాడిగా, నాయకుడిగా సక్సెస్ అయ్యాడు. అసలు కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచనే వద్దు. కోహ్లికి బాటన్ ఎప్పుడు ఇవ్వాలో ధోనికి తెలుసు'అని ప్రణబ్ రాయ్ తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన పలు టెస్టు మ్యాచ్‌లను కోల్పోవడంతో ధోని ఆకస్మికంగా ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అతని నిర్ణయం తనను ఆశ్చర్య పరిచింది. 90 టెస్టుల్లో ఆడిన ధోని ఆ తరహా నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదని ప్రణబ్ తెలిపాడు. కాగా, అతను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయానికి అంతా గౌరవం ఇవ్వాలన్నాడు. అయితే ఒక సెలక్టర్ గా ధోని ఎంపిక చేయడం తన అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నాడు.