breaking news
in pothavaram
-
ఇక డిజిటల్ డోర్ నంబర్లు
పోతవరం (నల్లజర్ల) : జిల్లాలో అన్ని గ్రామ, నగరపాలక, పురపాలక సంఘాల్లో ఇళ్లకు త్వరలో డిజిటల్ డోర్ నంబర్లు ఏర్పాటు చేయనున్నారు. గణిత భాషలో వేసే నంబర్లు తెలుసుకోవడం ప్రభుత్వ సిబ్బందికి కష్టంగా ఉండేది. అలా కాకుండా ఒకే చట్రంలో రాష్ట్రం, పట్టణం, వార్డు, వీధి, ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబర్ కేటాయించనున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలను భౌగోళిక సమాచార (జీఐఎస్) వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లజర్ల మండలంలోని స్మార్ట్ విలేజ్ పోతవరంలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. శాస్త్రీయ విధానంలో ఇళ్ల నంబర్ల కేటాయింపు అన్ని గ్రామాల్లో ఇళ్లు, వీధుల హద్దులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫుట్‌పాత్‌లు, పార్క్‌లు, రహదారులు, చప్తాలు, ల్యాండ్ మార్క్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పబ్లిక్ ట్యాప్‌లు, చెత్తకుండీల ప్రదేశాలు, పక్కా కాలువలు తదితర 59 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించి భౌగోళిక సమాచార వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. సర్వేలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఇళ్ల నంబర్లను మార్పు చేసి శాస్త్రీయవిధానంలో కేటాయిస్తారు. ఇంటి నంబర్లలో ముందుగా రాష్ట్రం, గ్రామం, వీధి, వార్డు ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబరు కేటాయించగా జియోట్యాగింగ్ చేస్తారు. నంబర్ ప్లేటు ఎదుట స్వచ్ఛభారత్ సింబల్‌తో పరిశుభ్రత, ఆరోగ్యం సూచిస్తూ స్వచ్ఛత వైపు అని సూచిస్తూ వెనుక వైపు డిజిటల్ మైక్రో ఐడీ నంబర్ ఉంటుంది. దీనిని ఇంటి యజమాని పంచాయతీ అసెస్మెంట్ నంబర్‌తో అనుసంధానించి ఇంటి గుమ్మంపై స్క్రూలతో బిగిస్తారు. అదే నంబర్ స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం పోతవరంలో ఈ విధానం అమలుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ సమయంలో సిబ్బంది ఆ డిజిటల్ బోర్డుపై స్కానర్ వంటి ప్రత్యేక పరికరంతో స్కాన్ చేస్తారు. వెంటనే సంబంధిత గృహ యజమానికి, పంచాయతీ అధికారులకు ఆ ఇంటి నుంచి చెత్త సేకరించినట్టు ఫోన్ ద్వారా సమాచారం (మెసేజ్) వస్తుంది. ఇదే సమాచారం సంబంధిత సర్పంచ్, కార్యదర్శి, సీఎం డ్యాష్ బోర్డుకు సైతం చేరుతుంది. సిబ్బంది ఎక్కడ ఏ౾ చేస్తున్నారనే విషయం సులభంగా తెలుస్తుందని గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్ వెల్లడించారు. ఇంటి యజమానుకులకు ఇచ్చిన మైక్రో డిజిటల్ నంబర్‌తో గ్రామంలో పంచాయతీ ద్వారా తాగునీరు అందకపోయినా, వీధిలైటు వెలగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధానం ద్వారా మరిన్ని కార్యక్రమాలు అమల్లోకి తేనున్నట్టు గ్రామ కార్యదర్శి రంగనాయకమ్మ తెలిపారు. -
చంద్రబాబుకు ఝలక్
సీఎం పర్యటన, పోతవరంలో, శనివారం cm tour, in pothavaram, saturday అందరూ సంతోషంగా ఉన్నారా’ నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న ఇది. ‘లేదు.. లేదు.. ఎవరికీ సంతోషం లేదు’ గ్రామస్తులిచ్చిన సమాధానం అదిరిపడిన సీఎం ‘ఎంతమంది సంతృప్తికరంగా లేరో చేతులెత్తుండి’ అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న వారిలో 70 శాతం మంది చేతులెత్తారు. సర్దుకున్న చంద్రబాబు కారణం ఏమిటో చెప్పండని అడగ్గా.. ‘ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పాలన లంచాలమయంగా మారింది’ అంటూ ఘాటుగానే జవాబిచ్చారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు అక్కడి పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నానని ఘనంగా చెప్పారు. ‘ఈ గ్రామానికి అన్నీ చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా’ అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు. దీనికి జనం నుంచి ‘లేదు.. లేదు’ అనే సమాధానం రావడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారు. ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా.. సభలోని 70 శాతం మంది చేతులు పైకెత్తారు. వారిలో కొందరిని మీ సమస్యలేమిటని చంద్రబాబు ఆరా తీశారు. లంచం ఇస్తేనే పని చేస్తారట గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని, తమకున్న పొలానికి పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు చేసి.. 70 సెంట్ల పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే... రూ.30 వేలు లంచమిస్తేనే పని చేస్తామని చెబుతున్నారని వాపోయింది. ఎవరు అడిగారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. వీఆర్ఓ ఫణిబాబు అని సమాధానం చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారిపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు మరో వృద్ధురాలు శ్యామలను సంతృప్తిగా ఉన్నావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని, సంతృప్తి ఎలా ఉంటుందని బదులిచ్చింది. రేషన్ కార్డు ఉందా అన్ని అడగ్గా.. ‘కార్డు లేదు. రేషన్ లేదు. పింఛన్ కూడా రావడం లేదు’ అని బదులిచ్చింది. కంగుతిన్న ముఖ్యమంత్రి నీ కుటుం బంలో ఎవరికైనా పింఛను వస్తుందేమో.. అందుకే తొలగించి ఉంటారన్నారు. తన కుటుంబంలో ఎవరికీ పెన్షన్ లేదని, తనకూ రావడం లేదని వాపోయింది. అధికారులు నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వేరే వ్యకితో మాట్లాడారు. ఇల్లు మంజూరు కాలేదు గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ‘నీవు సంతృప్తిగా ఉన్నావా’ అని సీఎం అడగ్గా.. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటి కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పాడు. సీఎం బదులిస్తూ.. ‘ఇప్పుడే శంకుస్థాపన చేశాను. త్వరలో నీకు ఇల్లు వస్తుందిలే. అప్పుడు సంతృప్తిగా ఉందువు’ అని ముఖ్యమంత్రి సర్ధి చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా వెంటాడతానని సీఎం హెచ్చరించారు. అవినీతిపరులపై దాడులు చేయిస్తామని.. పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు. దాడుల్లో పట్టుబడిన అధికారులు రెండు నెలల అనంతరం తమ ఉద్యోగం తిరిగొస్తుందనే భావనలో ఉన్నారని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇదిలావుండగా నల్లజర్లలో జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభకు జనం రాలేదు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలను తీసుకొచ్చినా.. సభావేదిక ముందు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రైతులు భూములివ్వాల్సిందే ఏలూరు (మెట్రో) : రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నల్లజర్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చేయాలంటే భూమి అవసరమన్నారు. అందువల్ల రైతులు ఉదా రంగా భూములు ఇవ్వాలని కోరారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉందని, అటువంటి పరిశ్రమలకు అడ్డుపడకూడదని పరోక్షంగా ఆక్వాపార్క్ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అంతకుముందు పోతవరం విచ్చేసిన చంద్రబాబుకు స్వాగతం లభించింది. మంత్రులు దేవినేని ఉమ, పైడికొం డల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మురళీమోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాం జనేయులు, ఎం.శ్రీనివాసరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్ పసుమర్తి సతీష్ పాల్గొన్నారు.